ఉన్నత విద్యలో ఫీజుల పెంపు ఉపసంహరించుకోవాలి

ప్రైవేటు యాజమాన్యాలను ప్రోత్సహించడం సరికాదు
డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ
బెజవాడ ఎక్స్ ప్రెస్, విజయవాడ
రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు క్షీణిస్తున్న సమయంలో ఫీజుల పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా వైద్య విభాగం ఛైర్మన్ డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ డిమాండ్ చేశారు. విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుండా ప్రైవేటు యాజమాన్యాల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. నాక్ గుర్తింపు ప్రక్రియలో లంచాల ఆరోపణలు, సీబీఐ దర్యాప్తు వంటి పరిణామాలు ఉన్నత విద్యావ్యవస్థలో నెలకొన్న అవకతవకలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌కు ఛైర్మన్‌ను నియమించకపోవడంతో విద్యాసంస్థలపై సరైన పర్యవేక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు.
దీని కారణంగా అనేక వైద్య, దంత కళాశాలలు నేషనల్ మెడికల్ కమిషన్ నేషనల్ డెంటల్ కమిషన్ తనిఖీలను ఎదుర్కోలేదని, విద్యార్థులకు స్టైపెండ్లు సకాలంలో అందడం లేదని, ప్రైవేటు కళాశాలల్లో అధ్యాపకులకు నిబంధనల ప్రకారం జీతాలు చెల్లిస్తున్నారో లేదో ప్రభుత్వం పర్యవేక్షించడంలో విఫలమైందని అన్నారు. అర్హత లేని బోధనా సిబ్బంది, తగిన ల్యాబ్‌లు, లైబ్రరీలు లేకపోవడం, విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేయడం వంటి సమస్యలను పరిష్కరించకుండా ఫీజులు పెంచడం సమంజసం కాదని ఆయన స్పష్టం చేశారు. విద్యా ప్రమాణాల క్షీణత, నియంత్రణ సంస్థల పనితీరుపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలని, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఫీజుల పెంపు ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.