విజయవాడ వార్తలు

ఎన్టీఆర్ వైద్య సేవలో అవినీతి, అస్తవ్యస్త పాలనపై వినతిపత్రం

బెజవాడ ఎక్స్‌ప్రెస్ బ్యూరో · July 17, 2026 · 1 month క్రితం

ఎన్టీఆర్ వైద్య సేవలో అవినీతి,

అస్తవ్యస్త పాలనపై వినతిపత్రం

అరాచకాలను అరికట్టాలి,

ఎం. గణేశ్,జర్నలిస్టు

విజయవాడ — ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో జరుగుతున్న అవినీతిని, అస్తవ్యస్తమైన పాలనను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా డాక్టర్స్ వింగ్ చైర్మన్ డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఈఓ శ్రీ ఎల్. శ్రీనివాసరావుకు ఈరోజు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ వింగ్ చైర్మన్‌తో పాటు జిల్లా వాణిజ్య విభాగం చైర్మన్ తనుబుద్ది చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి తంగిరాల రామిరెడ్డి, మరియు జిల్లా యాక్టివ్ వింగ్ కార్యదర్శి పొనుగోటి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. గతంలో పేదలకు కొండంత అండగా నిలిచిన ఈ పథకం, ప్రస్తుత పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి, అవినీతికి నిలయంగా మారిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆయుష్మాన్ భారత్ అనుసంధానం పేరుతో 3,250గా ఉన్న వైద్య ప్రక్రియలను (ప్రొసీజర్స్) 2,000 కంటే తక్కువకు కుదించడం వల్ల లక్షలాది మంది పేదలకు ప్రాణ రక్షణ కల్పించే చికిత్సలు అందకుండా పోతున్నాయని ప్రతినిధి బృందం ఎండగట్టింది. ఇది సంస్కరణ కాదని, పేదల పట్ల చేస్తున్న ద్రోహమని వారు పేర్కొన్నారు. జూన్ 2024 నుండి జూన్ 27, 2025 వరకు జరిగిన వైద్య ఆడిట్‌లో 2.79 లక్షల కేసుల్లో ఏకంగా 19,526 నకిలీ క్లెయిమ్‌లు బయటపడటం దారుణమని, ప్రైవేట్ ఆసుపత్రులు అనవసరమైన ఆపరేషన్లు చేస్తూ, లేని జబ్బులకు బిల్లులు పెట్టి, అమాయక కుటుంబాలను దోచుకుంటున్నాయని వారు ఆరోపించారు. ట్రస్ట్ మరియు ఇన్సూరెన్స్ ఆధారిత మోడళ్ల మధ్య ఉన్న అయోమయం వల్ల నిధుల విడుదల నిలిచిపోయి, ఆసుపత్రులు రోగులను చేర్చుకోవడానికి నిరాకరిస్తున్నాయని, ఫలితంగా రోగులు ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే 3,250 వైద్య ప్రక్రియలను పునరుద్ధరించాలని, నిలిచిపోయిన బిల్లుల సమస్యను పరిష్కరించి ఆసుపత్రుల ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని, అవినీతికి పాల్పడిన ఆసుపత్రులను బ్లాక్‌లిస్ట్ చేయడమే కాకుండా, పేదల సొమ్మును దోచుకున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించే బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకోరాదని, ఇప్పటికైనా ట్రస్ట్ అధికారులు మేల్కొని వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని వారు హెచ్చరించారు. ఈ అరాచకాలను అరికట్టి, పథకం యొక్క ఆశయాన్ని కాపాడాలని కోరుతూ వారు వినతిపత్రాన్ని అందజేశారు.