కోటిపల్లి

కొటిపల్లి–నరసాపూర్ రైల్వే లైన్‌కు రూ.100 కోట్ల అదనపు నిధులు
ఎం.గణేశ్, జర్నలిస్టు
కోనసీమ ప్రాంత ప్రజల దశాబ్దాల కల అయిన కొటిపల్లి–నరసాపూర్ కొత్త బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ పనులను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు రాష్ట్ర వాటా కింద అదనంగా రూ.100 కోట్లను మంజూరు చేసినట్లు రాష్ట్ర రోడ్లు–భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు.కేంద్ర రైల్వే శాఖతో కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 25 శాతం నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించాల్సి ఉందని మంత్రి తెలిపారు. ఇందులో భూసేకరణ, సివిల్ పనుల వ్యయాలు కూడా రాష్ట్ర వాటాలో భాగమని పేర్కొన్నారు. ఇప్పటికే భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తాన్ని కూడా రాష్ట్ర వాటా కింద పరిగణించేందుకు రైల్వే శాఖ అంగీకరించిందని వివరించారు.తాజాగా మంజూరు చేసిన రూ.100 కోట్లను తక్షణమే అమలాపురం ఆర్డీవో ఖాతాకు బదిలీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర వాటా నిధుల లభ్యతను కారణంగా చూపి పనులు ఎక్కడా నిలిచిపోకుండా నిరంతరాయంగా కొనసాగించాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.
కొటిపల్లి–నరసాపూర్ రైల్వే లైన్ ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని వివరిస్తూ, కేంద్ర ప్రభుత్వ నిధులతో పనులు పూర్తి చేసి, అనంతరం రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాసిన విషయాన్ని బీసీ జనార్థన్ రెడ్డి గుర్తుచేశారు.రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కొటిపల్లి–నరసాపూర్ రైల్వే లైన్ పనులకు మరింత ఊపందుకుంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రైల్వే మార్గం పూర్తయితే కోనసీమ ప్రాంతానికి రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రాంతీయ ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలకు కూడా ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.