రాజకీయాలు

“నేరం ఆధునికమైతే… పోలీసింగ్ అంతకంటే ఆధునికం కావాలి” – ఫ్యూచర్-రెడీ ఏపీ పోలీస్‌కు హోంమంత్రి వంగలపూడి అనిత దిశా నిర్దేశం

బెజవాడ ఎక్స్‌ప్రెస్ బ్యూరో · July 21, 2026 · 1 month క్రితం
  • “నేరం ఆధునికమైతే… పోలీసింగ్ అంతకంటే ఆధునికం కావాలి” ఫ్యూచర్-రెడీ ఏపీ పోలీస్‌కు హోంమంత్రి వంగలపూడి అనిత దిశా నిర్దేశం
  • ఫ్యాక్షన్ నుంచి సైబర్ నేరాల వరకు కఠిన పోరు… ‘ఈగల్’ , ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌తో నేరాలపై ఉక్కుపాదం
  • 112 స్పందన వేగం పెంపు… మహిళలపై నేరాలు తగ్గింపు… సాంకేతిక పోలీసింగ్‌తో దేశానికే ఆదర్శంగా ఏపీ
  • ” ఫ్యూచర్-రెడీ ఏపీ పోలీస్ రిట్రీట్–2026″ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఎం. గణేశ్, జర్నలిస్టు.

నేరాల స్వరూపం వేగంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ కూడా అంతకంటే ఆధునికంగా, సాంకేతికత ఆధారంగా, ప్రజాకేంద్రీకృతంగా రూపాంతరం చెందాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయవాడలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కళా వేదికలో నిర్వహించిన ఫ్యూచర్-రెడీ ఏపీ పోలీస్ రిట్రీట్–2026′ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ఉన్నత పోలీసు అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు.2001లో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పోలీసు సంస్కరణల రిట్రీట్ సంప్రదాయాన్ని 25 సంవత్సరాల తర్వాత పునరుద్ధరించడం చారిత్రాత్మకమని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్ సవాళ్లను ముందుగానే అంచనా వేసి పోలీసు వ్యవస్థను సిద్ధం చేయడమే ఈ రిట్రీట్ లక్ష్యమని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం తరఫున కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు, డీజీపీ కార్యాలయం, జిల్లా పోలీసు అధికారులు, పోలీసు సిబ్బందిని అభినందించిన మంత్రి, క్షేత్రస్థాయిలో పోలీసులు చేస్తున్న సేవలకు ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉంటుందని చెప్పారు.ఫ్యాక్షన్ రాజకీయాలు, వామపక్ష తీవ్రవాదం, మతకలహాలను గణనీయంగా అదుపులోకి తీసుకురాగలిగామని, ప్రస్తుతం సైబర్ నేరాలు, రౌడీయిజం, సామాజిక మాధ్యమాల దుర్వినియోగాన్ని అరికట్టడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. ఆధునిక నేరాలను ఎదుర్కొనేందుకు పోలీసులు కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు.సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారం పెరుగుతోందని, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రచారాన్ని వాస్తవాలు, ఆధారాలతో తిప్పికొట్టాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ప్రతి ఘటనపై పారదర్శకంగా సమాచారం అందించడం ద్వారా పోలీసు వ్యవస్థపై ప్రజల విశ్వాసం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.మహిళలు, చిన్నారుల భద్రత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని పేర్కొంటూ, మహిళలపై నమోదవుతున్న నేరాలను సుమారు నాలుగు శాతం తగ్గించగలిగామని వెల్లడించారు. గంజాయి నిర్మూలన కోసం అమలు చేస్తున్న ఈగల్ వ్యవస్థ ద్వారా జిల్లా పోలీసు అధికారులు సమన్వయంతో గంజాయి సాగు, అక్రమ రవాణాపై సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.అత్యవసర సేవల 112 స్పందన వ్యవస్థ ద్వారా స్పందన సమయాన్ని గణనీయంగా తగ్గించామని, పోలీసింగ్‌లో ‘గోల్డెన్ టైమ్’ అత్యంత కీలకమని అన్నారు. వేగవంతమైన స్పందనతో నేరస్థులను త్వరగా అదుపులోకి తీసుకురావడంతో పాటు బాధితుల్లో భరోసా పెరుగుతుందని చెప్పారు.పోలీసు శాఖ బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఇప్పటికే 6,000 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. భవిష్యత్తులో ప్రతి ఉద్యోగ నియామక ప్రణాళికలో కొత్త పోలీసు పోస్టులను భర్తీ చేస్తూ శాఖను మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు.రాష్ట్రంలో శాంతిభద్రతలను మరింత పటిష్ఠం చేసేందుకు, నూతన తరహా నేరాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రత్యేక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

రెండు రోజుల రిట్రీట్‌లో మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణ, సైబర్ భద్రత, రౌడీయిజం నిర్మూలన, ఫ్యాక్షన్ రాజకీయాల నియంత్రణ, వామపక్ష తీవ్రవాద నిర్మూలన, మతసామరస్య పరిరక్షణ తదితర కీలక అంశాలపై ప్రత్యేక బృందాలు చర్చలు జరుపుతున్నాయని తెలిపారు. క్షేత్రస్థాయి అనుభవాల ఆధారంగా రూపొందే సూచనలు రాష్ట్ర పోలీసింగ్‌కు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికగా ఉపయోగపడతాయని చెప్పారు.

రిట్రీట్ ముగింపు సమావేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారని, అధికారులు వినూత్న ఆలోచనలు, సంస్కరణల ప్రతిపాదనలు, కార్యాచరణ ప్రణాళికలను సమగ్రంగా సమర్పించాలని మంత్రి కోరారు.”నేరం ఎంత ఆధునికమైనా ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ దానికంటే ఒక అడుగు ముందే ఉంటుంది. సాంకేతికత, వేగవంతమైన స్పందన, పారదర్శకత, ప్రజల విశ్వాసంతో ఫ్యూచర్-రెడీ పోలీస్ వ్యవస్థను నిర్మించి దేశానికే ఆదర్శంగా నిలబెడతాం” అని వంగలపూడి అనిత స్పష్టం చేశారు.

భవిష్యత్ పోలీసింగ్‌పై డీజీపీ కార్యాచరణ

డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా రాబోయే 20 సంవత్సరాల సవాళ్లను ఎదుర్కొనే అత్యాధునిక పోలీసింగ్ వ్యవస్థను నిర్మించడమే లక్ష్యమని తెలిపారు. మారుతున్న నేరాల స్వరూపాన్ని దృష్టిలో ఉంచుకుని 10 కీలక అంశాలతో కూడిన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు.సాంప్రదాయ పోలీసింగ్‌కు బదులుగా డిజిటల్, సాంకేతికత ఆధారిత పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. నమోదైన కేసుల సంఖ్య కంటే, ముందుగానే నివారించిన నేరాలు, ప్రమాదాల ఆధారంగా పోలీసు పనితీరును అంచనా వేసే విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు.విదేశాల నుంచి జరిగే సైబర్ మోసాలు, డీప్‌ఫేక్‌లు, అనామక సైబర్ బెదిరింపులను ఎదుర్కొనేందుకు ముందస్తు నిఘా వ్యవస్థలను బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. డ్రోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డ్రోన్ నిఘా, నిర్వహణ కోసం పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.భౌతిక అర్హతలతో పాటు కోడింగ్, సంకేతలిపి శాస్త్రం, సైబర్ భద్రత వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన యువతను పోలీసు బలగాల్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అత్యవసర సేవల 112కు వచ్చే సమాచారంపై క్షణాల్లో స్పందించే వ్యవస్థను అభివృద్ధి చేయడంతో పాటు, పోలీసు–వైద్య–మహిళా సంక్షేమ శాఖల సమన్వయంతో గృహహింస, ఆత్మహత్యలు, బాలలపై నేరాల నివారణకు కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థలను వినియోగంలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.ఈ లక్ష్యాల సాధన కోసం స్వల్పకాలిక (0–3 సంవత్సరాలు), మధ్యకాలిక (3–7 సంవత్సరాలు), దీర్ఘకాలిక (7–20 సంవత్సరాలు) దశలవారీ కార్యాచరణతో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ముందుకు సాగుతుందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.