పవన్ కళ్యాణ్ తో పోటీ పడుతున్న అన్నా కొణిదెల..

- పవన్ కళ్యాణ్ తో పోటీ పడుతున్న అన్నా కొణిదెల..
- ఏనుగు, పులి సంరక్షణకు దత్తత
ఎం. గణేశ్, జర్నలిస్టు:
రాజకీయాలతో పాటు సామాజిక బాధ్యతలోనూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో ఆయన సతీమణి అన్నా కొణిదెల కూడా ముందుకు సాగుతున్నారు. ఆధ్యాత్మికత, సామాజిక సేవ, ప్రకృతి పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, భారతీయ సంస్కృతి–సంప్రదాయాల పట్ల ఆసక్తి కనబరుస్తూ ఆమె తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.ఇటీవల తన జన్మదినం సందర్భంగా విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలలో ఆసియా ఏనుగు, రాయల్ బెంగాల్ పులి సంరక్షణ కోసం అన్నా కొణిదెల దత్తత కార్యక్రమంలో పాల్గొన్నారు. వన్యప్రాణుల సంరక్షణ, పోషణ, వైద్య అవసరాల కోసం అవసరమైన నిధులను అందజేశారు.ఆసియా ఏనుగు సంరక్షణ కోసం రూ.4.30 లక్షలు, రాయల్ బెంగాల్ పులి సంరక్షణ కోసం రూ.2 లక్షలు అందించి, మొత్తం రూ.6.30 లక్షల వార్షిక వ్యయాన్ని భరించారు. ఈ కార్యక్రమం ద్వారా వన్యప్రాణుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన, బాధ్యత పెంపొందించాలనే సందేశాన్ని ఇచ్చారు.ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ పట్ల పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఆసక్తి తెలిసిందే. అదే స్ఫూర్తితో అన్నా కొణిదెల కూడా అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు తనవంతు సహకారం అందించడం విశేషంగా నిలిచింది.అన్నా కొణిదెల చేపట్టిన ఈ దత్తత కార్యక్రమానికి సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక బాధ్యత, సేవా దృక్పథంలో ఆమె ఆదర్శంగా నిలిచారని పలువురు అభినందిస్తున్నారు. భారతీయ సంస్కృతి, విలువలను ఆచరిస్తూ సమాజానికి సానుకూల సందేశం ఇస్తున్నారని కొనియాడుతున్నారు.