పుష్కర టెండర్లలో రాజకీయ జోక్యం

రూ.42.62 కోట్ల పనుల కేటాయింపుపై వివాదాలు
ఎం.గణేశ్, జర్నలిస్టు
కొవ్వూరు గోపాద క్షేత్రంలో గోదావరి పుష్కరాల కోసం చేపట్టనున్న రూ.42.62 కోట్ల అభివృద్ధి పనుల టెండర్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పనుల కేటాయింపులో రాజకీయ జోక్యం ఉందని, టెండర్లలో పాల్గొన్న కొందరు కాంట్రాక్టర్లపై ఒత్తిళ్లు తెస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐదుగురు కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొన్నట్లు సమాచారం. రాజకీయ పలుకుబడితో పనులు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారంతోపాటు, వెనుకబడిన వర్గానికి చెందిన ఓ కాంట్రాక్టర్ను పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరించారన్న ఆరోపణలు కూడా వెలువడ్డాయి. టెండర్ల నిబంధనలు, కాంట్రాక్టర్ల అర్హతలు, సాంకేతిక బిడ్ల పరిశీలన, పనుల కేటాయింపు వివరాలను వెల్లడించాలని కోరుతున్నారు. కాంట్రాక్టర్లపై ఒత్తిళ్ల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ఉల్లంఘనలు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.