ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్

పొగాకు రైతుల నిరసన సభను విజయవంతం చేయాలి: జెట్టి గురునాథరావు

బెజవాడ ఎక్స్‌ప్రెస్ బ్యూరో · July 6, 2026 · 2 months క్రితం

పొగాకు రైతుల నిరసన సభను విజయవంతం చేయాలి: జెట్టి గురునాథరావు

ఈ నెల 7న సభ జంగారెడ్డిగూడెంలో సభ

ఎం.గణేశ్, జర్నలిస్టు

 మెట్ట ప్రాంత పొగాకు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 7న జంగారెడ్డిగూడెం బైపాస్‌లోని టుబాకో బోర్డు రైతు ప్రాంగణంలో నిర్వహించనున్న భారీ నిరసన సభను విజయవంతం చేయాలని మెట్ట ప్రాంత రైతు నాయకుడు, వైఎస్సార్‌సీపీ మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ, పొగాకు రైతులు తీవ్ర సంక్షోభాన్ని  ఎదుర్కొంటు న్నప్పటికీ ప్రభుత్వం, టుబాకో బోర్డు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. గతంలో కిలో పొగాకు ధర రూ.295 నుంచి రూ.456 వరకు పలికేదని, ప్రస్తుతం అది రూ.265-270కు పడిపోవడం రైతులను తీవ్ర నష్టాల్లోకి నెట్టిందన్నారు. ధరలు పడిపోవడమే కాకుండా, రైతులు పండించిన మొత్తం పొగాకును కొనుగోలు చేస్తారో లేదో కూడా స్పష్టత లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. చింతలపూడి, పోలవరం, గోపాలపురం నియోజకవర్గాల పరిధిలోని వేలాది మంది రైతులు భారీ పెట్టుబడులతో పొగాకు సాగు చేశారని, బంగారం తాకట్టు పెట్టి, అప్పులు చేసి పంట పండించిన రైతులకు ఇప్పుడు మార్కెట్‌లో ఆశించిన ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, లేకుంటే రైతులు ఆత్మహత్యల దిశగా వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చిన్న, సన్నకారు రైతులతో పాటు కౌలు రైతులు కూడా గతంలో మంచి ధరలు రావడంతో ఈ ఏడాది అధిక మొత్తంలో భూములను కౌలుకు తీసుకుని పొగాకు సాగు చేశారని, ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారని పేర్కొన్నారు. రైతుల దుస్థితిని ప్రభుత్వం ప్రత్యక్షంగా పరిశీలిస్తే వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయని జెట్టి గురునాథరావు అన్నారు. రైతుల ఆవేదనకు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల నిరసన సభకు పొగాకు రైతు సంఘాలు, అన్ని వర్గాలు హాజరుకావాలని కోరారు.