ఆంధ్రప్రదేశ్

పోలీస్

బెజవాడ ఎక్స్‌ప్రెస్ బ్యూరో · అక్టోబర్ 16, 2026 · 2 వారాలు క్రితం

డ్రగ్స్‌ ముఠాలపై ఏపీ ఇంటెలిజెన్స్‌

రూ.1.9 కోట్ల గంజాయి పట్టివేత

ఎం.గణేశ్, జర్నలిస్టు

రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీసులు డ్రగ్స్‌, గంజాయి అక్రమ రవాణా ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. మాదకద్రవ్యాల సరఫరా, అక్రమ రవాణా, గంజాయి సాగుపై నిఘా పెంచిన కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం గడచిన నాలుగైదు రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కీలక ఆపరేషన్లు నిర్వహించింది. ఈగల్‌ బృందాలు, స్థానిక పోలీసులు, ప్రభుత్వ రైల్వే పోలీసులు, రైల్వే రక్షణ దళం సమన్వయంతో చేపట్టిన ఈ చర్యల్లో భారీగా గంజాయి, ఎండీఎంఏ డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

విజయవాడలో రూ.11 లక్షల డ్రగ్స్‌ పట్టివేత

విజయవాడ రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన తనిఖీల్లో రూ.11 లక్షల విలువైన 110 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి రైలులో మాదకద్రవ్యాలను తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఎంబీఏ విద్యార్థిని యెర్రంశెట్టి నాగ సౌమ్యను అరెస్టు చేశారు. ఆమెకు డ్రగ్స్‌ సరఫరాలో సహకరిస్తూ హ్యాండ్లర్‌గా వ్యవహరించిన షేక్‌ బషీర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. రైళ్ల ద్వారా మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతున్న నేపథ్యంలో రైల్వే స్టేషన్లు, అనుమానిత ప్రయాణికులపై నిఘాను మరింత పటిష్ఠం చేసినట్లు తెలుస్తోంది.

కారులో ఎండీఎంఏ తరలింపు

కర్నూలు జిల్లా అమకతాడు వద్ద మరో డ్రగ్స్‌ అక్రమ రవాణా వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు. హ్యుందాయ్‌ వెర్నా కారులో 20 గ్రాముల ఎండీఎంఏను తరలిస్తున్న నల్లూరి వరుణ్‌ తేజను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ విలువ సుమారు రూ.2 లక్షలుగా అంచనా వేశారు. రాష్ట్రంలో వివిధ మార్గాల ద్వారా మాదకద్రవ్యాలను తరలిస్తున్న ముఠాల కదలికలపై నిఘా పెట్టిన అధికారులు, అందిన సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నారు.

విశాఖ జిల్లాలో 385 కిలోల గంజాయి

గంజాయి అక్రమ రవాణాపై చేపట్టిన మరో కీలక ఆపరేషన్‌లో కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌, ఈగల్‌ బృందాలు విశాఖ జిల్లాలో భారీగా ఎండు గంజాయిని పట్టుకున్నాయి. తుర్లువాడ టోల్‌ప్లాజా వద్ద టాటా ఐషర్‌ వాహనంలో తరలిస్తున్న 385 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాయి. దీని విలువ సుమారు రూ.1.9 కోట్లుగా అంచనా వేశారు. ఒడిశాలోని మాచ్‌కండ్‌ ఏజెన్సీ ప్రాంతం నుంచి మహారాష్ట్రలోని షిర్డీకి గంజాయిని తరలిస్తున్న సమయంలో ఈ వాహనాన్ని పట్టుకున్నట్లు అధికారులు గుర్తించారు. అంతర్రాష్ట్ర స్థాయిలో గంజాయి రవాణా చేస్తున్న నెట్‌వర్క్‌లపై దర్యాప్తు కొనసాగుతోంది.

రెండు ఎకరాల్లో గంజాయి సాగు ధ్వంసం

నెల్లూరు జిల్లాలో అక్రమ గంజాయి సాగుపై పోలీసులు చర్యలు చేపట్టారు. దుత్తలూరు ప్రాంతంలో రెండు ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి పంటను గుర్తించి ధ్వంసం చేశారు. ఈ వ్యవహారంలో ఉప్పలపాటి సుబ్బారెడ్డిని అరెస్టు చేశారు. అతనిపై ఇప్పటికే 11 క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్రమ సాగు వెనుక ఉన్న ఇతర వ్యక్తులు, గంజాయి సరఫరా వ్యవస్థపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.

మాదకద్రవ్యాల నిర్మూలనకు సమన్వయ చర్యలు

రాష్ట్రంలో డ్రగ్స్‌, గంజాయి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు ఏపీ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అందించిన సమాచారంతో పలు ప్రాంతాల్లో ఏకకాలంలో నిఘా, తనిఖీలు నిర్వహించారు. ఈగల్‌ బృందాలు, స్థానిక పోలీసు యంత్రాంగం, ప్రభుత్వ రైల్వే పోలీసులు, రైల్వే రక్షణ దళం పరస్పర సమన్వయంతో పనిచేశాయి. రైల్వే మార్గాలు, రహదారులు, అంతర్రాష్ట్ర రవాణా మార్గాల్లో అక్రమ రవాణాను గుర్తించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు.

డ్రగ్స్‌ వినియోగం, అక్రమ రవాణా యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ప్రాధాన్యం ఇస్తున్నాయి. డ్రగ్స్‌, గంజాయి వ్యవహారాల్లో ఎవరున్నా ఉపేక్షించకుండా చట్టప్రకారం చర్యలు తీసుకునేలా జీరో టాలరెన్స్‌ విధానంతో ముందుకు సాగుతున్నాయి. రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు నిఘా, దాడులు, అంతర్రాష్ట్ర సమన్వయ చర్యలను మరింత విస్తరించడంపై పోలీసు శాఖ దృష్టి సారించింది.