ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్

ప్రముఖ కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత:

బెజవాడ ఎక్స్‌ప్రెస్ బ్యూరో · July 14, 2026 · 2 months క్రితం

ప్రముఖ కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత:
ముగిసిన ఒక శకం!
కిర్లంపూడి నుంచి అసెంబ్లీ వరకు
జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు

ఎం.గణే్శ్,జర్నలిస్టు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి, కాపు సామాజికవర్గ ఉద్యమాలకు ఆరాధ్యుడిగా నిలిచిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ, క్యాన్సర్‌ మరియు శ్వాసకోశ సంబంధిత తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో ఏపీ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ, సంచలన ప్రస్థానం ముగిసినట్లయింది. 1953 జనవరి 22న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం జన్మించారు. ఆయన తండ్రి వీరరాఘవరావు కిర్లంపూడి మున్సిఫ్‌గా, ప్రత్తిపాడు నుంచి రెండుసార్లు స్వతంత్ర ఎమ్మెల్యేగా పనిచేశారు. తండ్రి వారసత్వంతో చిన్న వయసులోనే ప్రజాసేవ వైపు ఆకర్షితులైన ముద్రగడ, అతి పిన్న వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
రాజకీయ ప్రస్థానం: 4 సార్లు ఎమ్మెల్యే.. ఒకసారి ఎంపీ!
రాష్ట్ర రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం సుదీర్ఘ కాలం పాటు కీలక పాత్ర పోషించారు. ప్రజాప్రతినిధిగా ఆయనకు ఘనమైన రికార్డు ఉంది. తొలి విజయం 1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జనతా పార్టీ తరపున పోటీ చేసి, తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టారు. 1983, 1985 తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఎన్టీఆర్ పిలుపుతో ఆ పార్టీలో చేరారు. 1983, 1985 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచే వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించి, ప్రజల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలతో ఉన్న బలమైన అనుబంధంతో ఆయన ప్రత్తిపాడు నుంచి మొత్తం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించి కీలక శాఖలను చేపట్టారు. లోక్‌సభ సభ్యుడిగా రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా కేంద్ర రాజకీయాల్లోనూ ఆయన తన సత్తా చాటారు. ఉమ్మడి కాంగ్రెస్ హయాంలో కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా (లోక్‌సభ సభ్యుడిగా) ఘన విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. తదనంతర కాలంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి కొనసాగారు. రాజకీయ పదవుల కంటే కూడా కాపు సామాజికవర్గ సంక్షేమం, వారిని బీసీ జాబితాలో చేర్చాలనే హక్కుల కోసమే ముద్రగడ ఎక్కువగా శ్రమించారు. కాపు రిజర్వేషన్ల సాధన కోసం ఆయన స్వగ్రామం కిర్లంపూడి వేదికగా చేపట్టిన ఉద్యమాలు, ఆమరణ నిరాహార దీక్షలు ఏపీ రాజకీయాలను తీవ్రంగా కుదిపేశాయి. ఉద్యమాల సందర్భంగా అనేక కేసులు, ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయని నిఖార్సైన నేతగా గుర్తింపు పొందారు. ముద్రగడ పద్మనాభం మరణం ఏపీ రాజకీయాలకే కాకుండా, ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి తీరని లోటు. నిగర్విగా, అవినీతి మరక లేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, కవులు, ఉద్యమకారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.