ఆంధ్రప్రదేశ్

బెజవాడ ఎక్స్‌ప్రెస్ బ్యూరో · అక్టోబర్ 27, 2026 · 2 రోజులు క్రితం

తీర ప్రాంతపు శాన్‌ఫ్రాన్సిస్కో విశాఖ

ఎం.గణేశ్, జర్నలిస్టు

ప్రకృతి అందాలకు సాంకేతిక అభివృద్ధిని జోడించి విశాఖపట్నాన్ని తూర్పు తీర ప్రాంతపు శాన్‌ఫ్రాన్సిస్కోగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. విశాఖలోని గంగవరం బీచ్‌ అందాలను సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా పంచుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సముద్రాన్ని తాకే కొండలు, రాతి శిఖరాలు, వేగంగా విస్తరిస్తున్న సాంకేతిక రంగం విశాఖ ప్రత్యేకతలని లోకేశ్‌ అభివర్ణించారు. ప్రకృతికి ఎలాంటి హాని కలగకుండా సాంకేతిక రంగంలోనూ నగరం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ప్రకృతి సౌందర్యం, నూతన ఆవిష్కరణలు సమన్వయంతో ఎలా ముందుకు సాగవచ్చో విశాఖ నగరం దేశానికి చాటిచెబుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గంగవరం బీచ్‌ అందాలపై ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు

గంగవరం బీచ్‌ అందాలను చూసి ముగ్ధుడైన ఆనంద్‌ మహీంద్రా, ఆ ప్రాంతానికి సంబంధించిన చిత్రాలను ఎక్స్‌లో పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తీరప్రాంత పర్యాటక కేంద్రాల జాబితాలో గంగవరం బీచ్‌ ఎందుకు లేదంటూ ఆసక్తికరంగా ప్రశ్నించారు. సాధారణ బీచ్‌లకు భిన్నంగా రాతి కొండలతో కూడిన ఈ ప్రాంతం ప్రత్యేకమైన, పురాతన సహజ సౌందర్యాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. విశాఖపట్నం సాంకేతిక రంగంలో కీలక కేంద్రంగా ఎదుగుతున్న నేపథ్యంలో, ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత పర్యాటక కేంద్రంగానూ అంతర్జాతీయ గుర్తింపు పొందే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలకు లోకేశ్‌ స్పందించడం విశాఖ అభివృద్ధిపై ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలను మరోసారి వెల్లడించింది.