ఆంధ్రప్రదేశ్

బెజవాడ ఎక్స్‌ప్రెస్ బ్యూరో · అక్టోబర్ 27, 2026 · 2 రోజులు క్రితం

మున్సిపోల్ పై ‘సుప్రీం’ ఆదేశాలు

ఎం.గణేశ్, జర్నలిస్టు

మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారని భావించే అభ్యర్థులు తగిన ఆధారాలతో చట్టప్రకారం ఎన్నికల పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.గత విచారణలో ఇచ్చిన ఆదేశాల అమలుపై రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం తమ నివేదికలను కోర్టుకు సమర్పించాయి. నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పించలేదని, పలుచోట్ల తమ పార్టీ అభ్యర్థులను అడ్డుకున్నారని వైఎస్సార్‌సీపీ తరఫు న్యాయవాదులు వాదించారు. మరోవైపు, కోర్టు ఆదేశాల మేరకు నామినేషన్ల గడువును పొడిగించామని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వివరించారు. ఫిర్యాదులు అందిన ప్రాంతాల్లో పరిశీలన జరిపి వివరాలు సమర్పించాలని గతంలో సూచించిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. నామినేషన్ల వివాదాలను పరిష్కరించుకునేందుకు చట్టపరమైన మార్గాలను అనుసరించాలని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియను హైకోర్టు రోజువారీగా పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేసే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది.