నల్లారికి మళ్లీ నిరాశే రాజకీయ భవిష్యత్తుపై మళ్లీ మొదలైన చర్చ

నల్లారికి మళ్లీ నిరాశే
రాజకీయ భవిష్యత్తుపై మళ్లీ మొదలైన చర్చ
ఎం. గణేశ్, జర్నలిస్టు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీని వీడి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీలో చేరిన ఆయనకు.. తాజా పరిణామాలు తీవ్ర నిరాశనే మిగిల్చినట్లు రాజకీయ వర్గాల్లో బలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పార్టీబలోపేతానికి, అలాగే ఆయన సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని అధిష్ఠానం రాజ్యసభ సభ్యత్వాన్ని కేటాయిస్తుందని గత కొంతకాలంగా ఆయన అనుచరులు, రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే, ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ ముగిసినప్పటికీ తుది జాబితాలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు లేకపోవడంతో ఆయనకు మరోసారి నిరాశే ఎదురైంది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్అధిష్ఠానం నిర్ణయాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి , ఆ తర్వాత ‘జై సమైక్యాంధ్ర’ పేరుతో సొంత పార్టీని స్థాపించారు. అయితే అక్కడ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తిరిగి సొంత గూడైన కాంగ్రెస్‌లోకి వెళ్లినప్పటికీ, జాతీయ స్థాయిలో తగిన ప్రాధాన్యత దక్కలేదు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వేదికగా బీజేపీ కండువా కప్పుకున్న ఆయన, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూటమి మద్దతుతో రాజంపేట నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలు కావడంతో అప్పటి నుంచి పార్టీలో తగిన గుర్తింపు లేదా కీలక పదవి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చక్రం తిప్పిన కీలక నేత, గత దశాబ్ద కాలంగా ఎలాంటి ఎన్నికైన పదవికి దూరం కావడం ఆయన రాజకీయప్రయాణంలో ఒక పెద్ద ప్రతిబంధకంగా మారింది. నిరంతరం పార్టీలు మారుతున్నా ఆశించిన స్థాయిలో పునరాగమనం సాధ్యం కాకపోవడంతో, భవిష్యత్తులో బీజేపీ అధిష్ఠానం ఆయనకు గవర్నర్వంటి రాజ్యాంగబద్ధ పదవులు ఇస్తుందా లేక జాతీయ కమిటీలో ప్రాధాన్యత కల్పిస్తుందా అనే అంశంపై రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.