వారిని వదులుకోవటానికీ సిద్ధం..సర్వేల్లో తేలిందిదే:

వారిని వదులుకోవటానికీ సిద్ధం..
సర్వేల్లో తేలిందిదే:
సీఎం చంద్రబాబు
ఎం.గణేశ్, జర్నలిస్టు
పార్టీలో గాడి తప్పుతున్న నాయకులకు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి గట్టి హెచ్చరిక చేశారు. ప్రజల్లో మంచి పేరు లేని, పనితీరు సరిగా లేని నాయకులను ఎంత పెద్ద వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినప్పటికీ కొందరిలో మార్పు కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడే వారికి మాత్రమే ప్రాధాన్యం ఉంటుందని, సర్వేల్లో ప్రతికూల అభిప్రాయం వచ్చిన వారిని అవసరమైతే వదులుకోవడానికి కూడా సిద్ధమేనని తేల్చిచెప్పారు. ప్రజల అభిప్రాయం, పార్టీ నిర్వహిస్తున్న అంతర్గత సర్వేల ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు పేర్కొన్నారు. నాయకులు ప్రజల్లో ఉండి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని, అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకునే ధోరణిని సహించబోమన్నారు. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదే తరహాలో గతంలోనూ చంద్రబాబు పలుమార్లు పార్టీ నేతలను హెచ్చరించారు. 2024లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహించిన సమన్వయ సమావేశాలు, పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని, అహంకార ధోరణి ప్రదర్శిస్తే సహించబోమని స్పష్టం చేశారు. పనితీరు సరిగా లేకపోతే మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, నియోజకవర్గ ఇన్‌చార్జులైనా మార్పులు తప్పవని అప్పుడే హెచ్చరించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, పార్టీ సర్వేలు, క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగానే బాధ్యతలు కొనసాగుతాయని, అవసరమైతే ఎలాంటి మొహమాటం లేకుండా మార్పులు చేస్తామని ఆయన పలుమార్లు చెప్పారు. ఇటీవల కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ప్రజల్లోనే ఎక్కువ సమయం గడపాలని, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించిన చంద్రబాబు, వ్యక్తిగత వర్గ రాజకీయాలు, ఆధిపత్య పోరు, క్రమశిక్షణా ఉల్లంఘనలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. తాజా హెచ్చరికతో మరోసారి పార్టీలో పనితీరు, క్రమశిక్షణకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు సంకేతాలు ఇచ్చినట్టుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.