అమరావతి రెండో దశకు సింగపూర్ మాస్టర్ ప్లాన్..

అమరావతి రెండో దశకు సింగపూర్ మాస్టర్ ప్లాన్..
22 వారాల్లో సమగ్ర రూపకల్పన
ఎం.గణేశ్, జర్నలిస్టు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి ఆర్థిక, పరిపాలనా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. అమరావతి 2.0 సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపకల్పన బాధ్యతలు స్వీకరించిన సింగపూర్‌కు చెందిన ప్రముఖ సలహా సంస్థ సుర్బానా జురాంగ్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి కార్యాచరణ ప్రణాళికను సమర్పించారు. వచ్చే 22 వారాల్లో పూర్తి స్థాయి సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేస్తామని వారు ప్రకటించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సుర్బానా జురాంగ్ బృందం ప్రణాళిక పరిధి, అమలు విధానం, భవిష్యత్ అభివృద్ధి దిశలపై సమగ్ర వివరాలు వెల్లడించింది. సుమారు 709.6 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఈ మాస్టర్ ప్లాన్‌లో పొందుపరుస్తున్నారు. కేవలం భవనాల నిర్మాణానికే పరిమితం కాకుండా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, స్థిరమైన పట్టణాభివృద్ధి, పెట్టుబడులకు అనుకూల వాతావరణం, భవిష్యత్ నగర విస్తరణకు అవసరమైన వ్యూహాత్మక జోనింగ్, ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలకు ఈ ప్రణాళికలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి కేవలం పరిపాలనా రాజధానిగా కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు నివసించే, పనిచేసే సమగ్ర రాజధానిగా రూపుదిద్దుకోవాలని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలని, అంతర్గత, బాహ్య వలయ రహదారులను సమర్థవంతంగా అనుసంధానించాలని సూచించారు. అదే సమయంలో అమరావతి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రధాన చోదకశక్తిగా మారేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ హరిత శక్తి వినియోగం, హరిత భవన నిర్మాణ విధానాలు, పర్యావరణహిత పట్టణ అభివృద్ధి అంశాలను మాస్టర్ ప్లాన్‌లో అంతర్భాగంగా చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలకు సమానంగా అమరావతిని సృజనాత్మక, ఆధునిక నగరంగా తీర్చిదిద్ది రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచే ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సుర్బానా జురాంగ్ నిర్ణయించిన 22 వారాల గడువులో మాస్టర్ ప్లాన్ సిద్ధమైతే, అమరావతి రెండో దశ అభివృద్ధి పనులు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.