ఎంబీబీఎస్ సీట్ల సాధనలో ఏపీ వెనుకబడింది: వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం

ఎంబీబీఎస్ సీట్ల సాధనలో ఏపీ వెనుకబడింది: వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం
ఎం. గణేశ్, జర్నలిస్టు :
2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ వైద్య సీట్ల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా వైద్య విభాగం ఆరోపించింది. అభివృద్ధి సూచికల్లో వెనుకబడిన రాష్ట్రంగా భావించే బీహార్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ తక్కువ ఎంబీబీఎస్ సీట్లు సాధించడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించింది.వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ విజయవాడలో విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, జాతీయ వైద్య మండలి దేశవ్యాప్తంగా 9,911 అదనపు ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేయగా, ఆంధ్రప్రదేశ్‌కు కేవలం 375 సీట్లు మాత్రమే లభించాయని, అదే సమయంలో బీహార్‌కు 740 కొత్త సీట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఇది కేవలం గణాంకాల తేడా కాదని, ప్రభుత్వ పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్‌కు లభించిన 375 సీట్లలో 150 సీట్లు గత ప్రభుత్వ హయాంలో ప్రణాళిక రూపొందించి, నిధులు కేటాయించి ప్రారంభించిన వైద్య కళాశాలలకు సంబంధించినవేనని తెలిపారు. గత రెండేళ్లలో కొత్తగా వైద్య కళాశాలల అభివృద్ధికి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టలేదని ఆరోపించారు.కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాలు వైద్య విద్యలో పురోగతి సాధిస్తుండగా, ఆంధ్రప్రదేశ్ మాత్రం జాతీయ వైద్య మండలి నిబంధనలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనలో వెనుకబడిందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు ప్రైవేటు వైద్య కళాశాలల్లో అధిక ఫీజులు చెల్లించాల్సి వస్తోందని, లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్న గత ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం ప్రభుత్వం ముందు రెండు డిమాండ్లు ఉంచింది. బీహార్ కంటే ఆంధ్రప్రదేశ్‌కు తక్కువ ఎంబీబీఎస్ సీట్లు ఎందుకు లభించాయో వివరిస్తూ వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని, అలాగే ఈ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆరోగ్య శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.