స్వర్ణ భవిత కేంద్రం ప్రారంభం

– ప్రత్యేక అవసరాల పిల్లలకు నాణ్యమైన సేవలే లక్ష్యం
– రేపల్లెలో స్వర్ణ భవిత వనరుల కేంద్రాన్ని ప్రారంభించిన రెవెన్యూ శాఖ మంత్రి
ఎం. గణేశ్, జర్నలిస్టు
ప్రత్యేక అవసరాల పిల్లలకు నాణ్యమైన విద్య, వైద్య, పునరావాస సేవలను అందించేందుకు స్వర్ణ భవిత వనరుల కేంద్రాలు దోహదపడాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు.రేపల్లె మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో రూ.29.30 లక్షల వ్యయంతో నిర్మించిన స్వర్ణ భవిత ప్రత్యేక అవసరాల పిల్లల వనరుల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా కేంద్రంలోని వివిధ గదులు, సౌకర్యాలను పరిశీలించిన మంత్రి అక్కడ విద్యనభ్యసిస్తున్న ప్రత్యేక అవసరాల పిల్లలను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం వారి తల్లిదండ్రులతో సమావేశమై సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు.ప్రత్యేక అవసరాల పిల్లలు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ఎదిగేలా ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందని మంత్రి తెలిపారు. వారికి నాణ్యమైన విద్య, వైద్య సేవలు, చికిత్స, థెరపీ, పునరావాస సౌకర్యాలను ఒకే వేదికపై అందించాలనే లక్ష్యంతో స్వర్ణ భవిత కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి చిన్నారి ప్రతిభను వెలికితీసి వారి భవిష్యత్తును మెరుగుపరిచేందుకు అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాల పిల్లలకు అవసరమైన విద్యా, వైద్య, థెరపీ సేవలను సమగ్రంగా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. స్వర్ణ భవిత కేంద్రం ద్వారా నిపుణుల సేవలు అందేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి బి. శ్రీదేవి, జిల్లా సమగ్ర విద్యా అధికారి కోదండరామ్, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ సింగ్, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.