రాజకీయాలు

మోదీని తిడితే కన్నీళ్లొచ్చాయి… పవన్ కల్యాణ్ ఎమోషనల్ స్పీచ్..

బెజవాడ ఎక్స్‌ప్రెస్ బ్యూరో · August 1, 2026 · 4 weeks క్రితం

  • భోగాపురం సభలో భావోద్వేగ ప్రసంగం చేసిన పవన్ కల్యాణ్
  • మోదీని తిడితే కన్నీళ్లొచ్చాయి…
  • మౌలిక సదుపాయాలతోనే అభివృద్ధి
  • మోదీ నాయకత్వంపై ప్రశంసలు
  •  యువతకు పవన్ పిలుపు

ఎం. గణేశ్, జర్నలిస్టు:

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భావోద్వేగంతో ప్రసంగించారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును విమానాశ్రయానికి పెట్టడం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ గర్వకారణమని, ఆయన ఆశయాలను భావితరాలకు చేరవేసే నిర్ణయమని అన్నారు.అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య స్ఫూర్తికి ప్రతీకగా నిలిచారని, ఆయన పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కావడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. స్వదేశీ సాంకేతికతతో విమానాశ్రయాన్ని నిర్మించిన జీఎంఆర్ సంస్థను అభినందించారు.కేవలం ప్రకటనలతో అభివృద్ధి సాధ్యం కాదని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే నిజమైన వికాసం సాధ్యమవుతుందని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్రానికి రూ.17,435 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు లభించాయని, విశాఖపట్నానికి రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు, అమరావతికి రూ.50 వేల కోట్ల పెట్టుబడులు రావడం అభివృద్ధికి నిదర్శనమని చెప్పారు. ఒకప్పుడు కనీస రవాణా సౌకర్యాలు కూడా సరిగా లేని ప్రాంతానికి నేడు అంతర్జాతీయ విమానాశ్రయం రావడం ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది పలికిందని పేర్కొన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ దేశాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడని కొనియాడిన పవన్ కల్యాణ్, ఆయనపై విమర్శలు వచ్చినప్పటికీ దేశ ప్రయోజనాలనే ముందుంచి పనిచేస్తున్నారని అన్నారు. దేశాన్ని ప్రపంచ వేదికపై బలమైన స్థానంలో నిలబెట్టడంలో మోదీ పాత్ర కీలకమని వ్యాఖ్యానించారు. దేశం కోసం అంకితభావంతో పనిచేసే నాయకుల విలువను యువతకు తెలియజేయాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.ప్రసంగం ముగింపులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తమ మద్దతు కొనసాగుతుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.