రాజకీయాలు

భోగాపురం విమానాశ్రయం.. ఉత్తరాంధ్రకు కొత్త అభివృద్ధి కేంద్రం

బెజవాడ ఎక్స్‌ప్రెస్ బ్యూరో · August 2, 2026 · 2 weeks క్రితం

–      భోగాపురం విమానాశ్రయం.. ఉత్తరాంధ్రకు కొత్త అభివృద్ధి కేంద్రం

–       ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో నిర్మాణం

–      మూడు జిల్లాలకు సులభ రాకపోకలు

ఎం. గణేశ్, జర్నలిస్టు

ఉత్తరాంధ్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అత్యాధునిక సదుపాయాలతో నిర్మించారు. ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం విమానాశ్రయం భౌగోళిక పరిమితుల కారణంగా విస్తరణకు అవకాశం లేకపోవడంతో కొత్త విమానాశ్రయం అవసరమైంది.భోగాపురం విమానాశ్రయంలో 3,800 మీటర్ల పొడవైన రన్‌వే, సమాంతర టాక్సీవే ఏర్పాటు చేశారు. దీంతో భారీ అంతర్జాతీయ విమానాలు కూడా సులభంగా రాకపోకలు సాగించగలవు. అలాగే ఏడాదికి 20 వేల మెట్రిక్ టన్నుల సరుకును నిర్వహించే కార్గో కేంద్రంతో పాటు విమానాల మరమ్మతు, నిర్వహణ కోసం ప్రత్యేక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై ఉండటంతో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు ఈ విమానాశ్రయం సులభంగా చేరుకునేలా ఉంటుంది. తొలి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యంతో నిర్మించిన ఈ విమానాశ్రయాన్ని భవిష్యత్తులో 2.4 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించే స్థాయికి విస్తరించనున్నారు.ఇప్పటికే విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ అనుమతి లభించగా, అంతర్జాతీయ ఇమిగ్రేషన్ తనిఖీ కేంద్రంగా కూడా గుర్తింపు దక్కింది. దీంతో భవిష్యత్తులో విదేశీ విమాన సర్వీసులు నేరుగా ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడనుంది.భోగాపురం విమానాశ్రయం కేవలం రాకపోకలకే పరిమితం కాకుండా, ఉత్తరాంధ్రలో పరిశ్రమలు, పెట్టుబడులు, ఎగుమతులు, పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడే కీలక మౌలిక సదుపాయంగా నిలవనుంది.