అభివృద్ధి దిశగా మరో ముందడుగు..

- అమరావతి నుంచి విశాఖ వరకు..
- అభివృద్ధి అజెండాకు మంత్రిమండలి ముద్ర
- మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, సంక్షేమానికి పెద్దపీట
- ప్రజా సంక్షేమం–పెట్టుబడులు–రాజధాని నిర్మాణానికి ప్రాధాన్యత
- అభివృద్ధి దిశగా మరో ముందడుగు.
- మంత్రి పార్ధసారధి
ఎం.గణేశ్, జర్నలిస్టు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో 1391వ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది.రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, రాజధాని నిర్మాణం సహా పలు రంగాలకు సంబంధించిన 33 కీలక ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.సమావేశం అనంతరం సమాచార, పౌరసంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారధి మంత్రిమండలి నిర్ణయాలను వెల్లడించారు.ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల, పెట్టుబడుల ప్రోత్సాహం, రైతులు, విద్యార్థులు, ఉద్యోగార్థులు, పేదలకు ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.విశాఖపట్నం వెలంపేట మురికివాడ పునరాభివృద్ధికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.అక్కడ నివసిస్తున్న 177 ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాలకు అదే ప్రాంతంలో పునరావాసం కల్పించి బహుళ అంతస్తుల భవనం నిర్మించనున్నారు.ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో 24 నెలల్లో పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు.రాష్ట్రవ్యాప్తంగా పాదచారుల భద్రత, అందరికీ సౌకర్యవంతమైన రవాణా విధానాన్ని అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది.కాలిబాటల ఆక్రమణల తొలగింపు, ప్రమాద ప్రాంతాల అభివృద్ధి, రహదారి భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు.మౌలిక సదుపాయాల నిర్మాణంలో నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరిగితే సంబంధిత అధికారులపై వ్యక్తిగత బాధ్యతతో జరిమానాలు విధించనున్నారు.మహిళలు, చిన్నారుల రక్షణకు గతంలో రూపొందించిన దిశ బిల్లును ఉపసంహరించుకోవాలని మంత్రిమండలి నిర్ణయించింది.కొత్త కేంద్ర నేర చట్టాలు అమల్లోకి రావడంతో అవసరమైన నిబంధనలు ఇప్పటికే అమలులో ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.ఆక్వా రైతులకు యూనిట్‌కు రూపాయి యాభై పైసల విద్యుత్ రాయితీని కొనసాగించాలని నిర్ణయించారు.ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా రైతులకు భారీ స్థాయిలో ఆర్థిక ప్రయోజనం కలగనుంది.పారిశ్రామిక పార్కుల్లో విద్యుత్ పర్యవేక్షణ రుసుము తగ్గించి అభివృద్ధి రుసుములను పూర్తిగా మినహాయించేందుకు ఆమోదం తెలిపారు.శ్రీ సిటీ పారిశ్రామిక ప్రాంతానికి నీటి సరఫరా కోసం అవసరమైన భూకేటాయింపులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.కుసుమ్ పథకం కింద కడప జిల్లాలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వ భూములను లీజుకు కేటాయించాలని నిర్ణయించారు.పుట్టపర్తి, మదనపల్లె, అమలాపురంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వ భూముల కేటాయింపుకు ఆమోదం లభించింది.పారిశ్రామిక, గృహ నిర్మాణ అవసరాల కోసం పలు జిల్లాల్లో ప్రభుత్వ భూముల బదిలీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.కొత్త జిల్లాలకు అనుగుణంగా పట్టణాభివృద్ధి సంస్థల పరిధులను పునర్వ్యవస్థీకరించి పట్టణ ప్రణాళికను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని నిర్ణయించింది.