కలెక్టర్ల సమావేశం

సీసీఎల్ఏలో భూ బ్యాంక్ పోర్టల్
సీఎం ఆదేశాలు
ఎం.గణేశ్, జర్నలిస్టు
రాష్ట్రంలోని వినియోగంలో లేని ప్రభుత్వ భూముల వివరాలతో సమగ్ర భూ బ్యాంక్ పోర్టల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జిల్లాలు, శాఖల వారీగా భూముల వివరాలను నమోదు చేసి, భవిష్యత్ అభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టులకు ముందుగానే భూమిని సిద్ధం చేయాలని సూచించారు. భూమి కొరత అభివృద్ధికి అడ్డంకి కాకూడదన్నారు. కలెక్టర్లు ముందుగానే మూడు నెలల కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ఫలితాలు సాధించాలని సీఎం ఆదేశించారు. సమస్యలను కేవలం నివేదించకుండా పరిష్కారాలు చూపాలని, రియాక్టివ్ పాలనకు బదులు ముందస్తు చర్యలతో కూడిన పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బుడగ జంగాలకు ఎస్సీలకు అందుతున్న ప్రయోజనాలను వర్తింపజేసేలా తక్షణం ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను పరిశ్రమలతో అనుసంధానించి 90 రోజుల్లో కరిక్యులమ్, పరికరాల ఏర్పాటును పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే మంజూరైన ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, అదనంగా మరో 1.5 లక్షల ఇళ్ల మంజూరుకు అవకాశం ఉందని తెలిపారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో తాగునీటి పనులను అత్యవసరంగా పూర్తి చేయాలని, రాష్ట్రంలో 50 శాతం హరిత ప్రాంతం లక్ష్యంగా 20 కోట్ల విత్తనాలు, మొక్కలను సిద్ధం చేయాలని సూచించారు. తక్కువ నీటితో పెరిగే మొక్కలను ప్రోత్సహించాలని, నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.