ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్

బీసీ రిజర్వేషన్లు

బెజవాడ ఎక్స్‌ప్రెస్ బ్యూరో · October 1, 2026 · 19 hours క్రితం

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు కీలక తీర్పు

34 శాతం రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. 

ఆరు వారాల్లో స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశం

ఎం.గణేశ్, జర్నలిస్టు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను హైకోర్టు కొట్టివేసింది. బీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుదీర్ఘ విచారణ అనంతరం ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు నిర్ణయించేటప్పుడు సుప్రీంకోర్టు నిర్దేశించిన పరిమితులు, నిబంధనలు పాటించాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. మొత్తం రిజర్వేషన్లు నిర్ణీత పరిమితిని మించకూడదని పేర్కొంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను చెల్లుబాటు కాకుండా చేసింది. బీసీల జనగణన పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కూడా హైకోర్టు కొట్టివేసింది. బీసీ జనగణన, రిజర్వేషన్ల ఖరారు పేరుతో ఎన్నికలను వాయిదా వేయడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను హైకోర్టు అనుమతించింది. ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియ కొనసాగుతున్న కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని కోరడం సమంజసం కాదని ధర్మాసనం పేర్కొంది. తుది ఓటర్ల జాబితా ప్రచురణ విషయంలో పంచాయతీరాజ్, పురపాలక శాఖలకు సంబంధించిన చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవద్దంటూ వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ధర్మాసనం పరిష్కరించింది. బీసీ జనగణన చేపట్టి, రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన మరో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కూడా కొట్టివేసింది. సర్పంచ్ ఎన్నికల్లో బీసీలను ఉపవర్గాలుగా విభజించి రిజర్వేషన్లు ఖరారు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సైతం హైకోర్టు కొట్టివేసింది. వార్డుల పునర్విభజన ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై దాఖలైన అప్పీళ్లలోనూ ధర్మాసనం జోక్యం చేసుకోలేదు. సెన్సెస్ కమిషనర్ జారీ చేసిన సర్క్యులర్ వార్డుల పునర్విభజన ప్రక్రియపై ప్రభావం చూపబోదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని వివిధ గ్రామ పంచాయతీలను సమీప పురపాలక సంస్థల్లో విలీనం చేస్తూ 2021 జూన్ 9న తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పురపాలక చట్ట సవరణను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను కూడా ధర్మాసనం కొట్టివేసింది. ఈ తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియకు హైకోర్టు స్పష్టత ఇచ్చింది. ఆరు వారాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.