
వంగవీటి పుష్పవల్లికి పురస్కారం
లండన్లో ‘గ్లోబల్ పయనీర్ అవార్డు’
ఎం. గణేశ్, జర్నలిస్టు
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ సతీమణి వంగవీటి పుష్పవల్లికి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారం లభించింది. లండన్లో నిర్వహించిన ఇండో–యూకే లీడర్షిప్ కాంక్లేవ్–2026లో ఆమెకు ‘గ్లోబల్ పయనీర్ అవార్డు’ను ప్రదానం చేశారు. భారతీయ జ్ఞాన వ్యవస్థలు, నాడీశాస్త్ర ఆధారిత విద్యారంగాల్లో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించినట్లు సమాచారం.లండన్లో జరిగిన కార్యక్రమంలో పుష్పవల్లి ఈ అవార్డును అందుకున్నారు. తన జీవిత భాగస్వామికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంపై వంగవీటి రాధాకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. తన సతీమణి సాధించిన విజయంపై గర్వంగా ఉందంటూ సామాజిక మాధ్యమ వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ఆమె విజయాన్ని కుటుంబ సభ్యులు, అభిమానులు అభినందిస్తున్నారు.పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన జక్కం అమ్మణి, బాబ్జీ దంపతుల చిన్న కుమార్తె పుష్పవల్లి. నరసాపురం, హైదరాబాద్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె యోగా ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. 2023లో వంగవీటి రాధాకృష్ణను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది.రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబంలోకి వచ్చిన పుష్పవల్లి, తన వ్యక్తిగత ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం విశేషంగా నిలిచింది. భారతీయ జ్ఞాన సంప్రదాయాలు, విద్యారంగానికి సంబంధించిన అంశాల్లో ఆమె చేసిన కృషికి అవార్డు లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.