ఆంధ్రప్రదేశ్

బెజవాడ ఎక్స్‌ప్రెస్ బ్యూరో · అక్టోబర్ 27, 2026 · 2 రోజులు క్రితం

విశాఖ కేంద్రంగా రైళ్ల రద్దు, దారి మళ్లింపు

ఎం.గణేశ్, జర్నలిస్టు

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్ణబ్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం కేంద్రంగా నడిచే పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్ల రాకపోకల్లో మార్పులు ప్రకటించారు. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 4 వరకు వివిధ తేదీల్లో ఈ మార్పులు అమల్లో ఉంటాయని వెల్లడించారు.విశాఖపట్నం–కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్ (18515, 18516) రైళ్లను అక్టోబర్ 29 నుంచి నవంబర్ 4 వరకు రద్దు చేశారు. విశాఖపట్నం–కోరాపుట్ ప్యాసింజర్ (58538) రైలును అక్టోబర్ 27 నుంచి 30 వరకు, కోరాపుట్–విశాఖపట్నం ప్యాసింజర్ (58537) రైలును అక్టోబర్ 28 నుంచి 31 వరకు రద్దు చేశారు.

విశాఖపట్నం–కోరాపుట్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (18512)ను అక్టోబర్ 30న, కోరాపుట్–విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (18511)ను అక్టోబర్ 31న రద్దు చేశారు. అలాగే విశాఖపట్నం–కిరండూల్ ప్యాసింజర్ (58501), కిరండూల్–విశాఖపట్నం ప్యాసింజర్ (58502) రైళ్లను అక్టోబర్ 27 నుంచి 30 వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌కు మార్పులు

హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రాకపోకల్లోనూ మార్పులు చేశారు. భువనేశ్వర్–జగదల్పూర్ హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ (18447) అక్టోబర్ 27 నుంచి 30 వరకు రాయగడలోనే ప్రయాణాన్ని ముగించనుంది. ఈ రైలు కోరాపుట్ వరకు వెళ్లదు. జగదల్పూర్–భువనేశ్వర్ హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ (18448) అక్టోబర్ 28 నుంచి 31 వరకు కోరాపుట్‌కు బదులుగా రాయగడ నుంచి బయలుదేరనుంది.

తుఫాన్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు రైల్వే శాఖ ప్రకటించే తాజా సమాచారాన్ని పరిశీలించిన తర్వాతే ప్రయాణానికి సిద్ధం కావాలని అధికారులు సూచిస్తున్నారు. రైలు నంబరు, ప్రయాణ తేదీ, రద్దు లేదా మార్గమార్పుల వివరాలను ముందుగా నిర్ధారించుకోవాలని కోరారు.