ఆంధ్రప్రదేశ్

తుపానులను ఢీ కొట్టిన ప్రకృతి వ్యవసాయం

బెజవాడ ఎక్స్‌ప్రెస్ బ్యూరో · నవంబర్ 11, 2026 · 6 రోజులు క్రితం

ఎం.గణేశ్, జర్నలిస్టు

అర్నబ్, మురసు తుఫానుల వరుస ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి వరి, అరటి, మిరప, పత్తి తదితర పంటలు అనేక ప్రాంతాల్లో నేలకొరిగాయి. అయితే ఇదే పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసిన పంటలు గణనీయమైన స్థిరత్వాన్ని ప్రదర్శించాయి. రసాయన వ్యవసాయంతో పోలిస్తే ప్రకృతి వ్యవసాయ పంటల్లో నష్టం చాలా తక్కువగా నమోదైనట్లు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనల్లో వెల్లడైంది.
పరిశీలనల ప్రకారం రసాయన పద్ధతిలో సాగు చేసిన పంటల్లో 40 నుంచి 100 శాతం వరకు నష్టం జరగ్గా, ప్రకృతి వ్యవసాయ పంటల్లో సాధారణంగా 0 నుంచి 20 శాతం మాత్రమే నష్టం నమోదైంది. ఒకే గ్రామంలో, ఒకే రకం విత్తనాలతో, దాదాపు ఒకే వాతావరణ పరిస్థితుల్లో సాగు చేసిన పంటలను పోల్చి పరిశీలించినప్పుడు ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపించింది.
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో స్పష్టమైన వ్యత్యాసం
కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరులో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ క్షేత్రస్థాయి పర్యటన సందర్భంగా ఈ వ్యత్యాసాన్ని గుర్తించారు. ఎంటీయూ-1318 రకం వరిని రసాయన పద్ధతిలో సాగు చేసిన తుమ్మూరు సంజీవరెడ్డి పొలంలో పంట ఎక్కువగా నేలవాలింది. అదే రకాన్ని ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన గుజ్జుల నాగరాజు పొలంలో పంట నిటారుగా నిలిచింది.
గుంటూరు జిల్లా తెనాలి మండలం ఎరుకులపూడిలో ప్రకృతి వ్యవసాయ రైతులు అన్నదాసు నాగేశ్వరరావు, ఆరాధ్యుల ఛాయనాద వర్మ సాగు చేసిన వరి పంటలు తుఫాను ప్రభావాన్ని తట్టుకున్నాయి. పక్కనే రసాయన పద్ధతిలో సాగు చేసిన శివనాగేశ్వరరావు పొలంలోని పంట పూర్తిగా నేలమట్టమైంది. కొల్లిపర మండలం హనుమాన్‌పాలెంలో ప్రకృతి వ్యవసాయ అరటి తోటలో 20 శాతం మొక్కలు మాత్రమే నేలకొరగ్గా, రసాయన పద్ధతిలో సాగు చేసిన తోటలో 80 శాతం మొక్కలు దెబ్బతిన్నాయి.
పశ్చిమగోదావరి, ప్రకాశంలోనూ ఇదే ఫలితాలు
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన సంపత్ స్వర్ణ వరి పంటలో 70 శాతం నిలబడగా, అదే రకాన్ని రసాయన పద్ధతిలో సాగు చేసిన పొలంలో పంట పూర్తిగా నేలవాలింది. పెంటపాడు మండలం బి.కొండేపాడులో ప్రకృతి వ్యవసాయ రైతు పాలా సాయిపద్మ పొలంలో 80 శాతం పంట నిలబడగా, పక్కనే రసాయన సాగులో పంట పూర్తిగా దెబ్బతింది.
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పురుమెట్లలో ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన 555 రకం మిరప పంటలో ఒక్క మొక్క కూడా నేలకొరగలేదు. అదే గ్రామంలో రసాయన పద్ధతిలో సాగు చేసిన తేజ రకం మిరపలో 40 శాతం మొక్కలు నేలవాలాయి. అద్దంకి మండలం చిన్న కొత్తపల్లిలో ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన 5204 రకం వరి నిలబడగా, అదే రకాన్ని రసాయన పద్ధతిలో సాగు చేసిన పొలంలో 70 శాతం పంట నేలకొరిగింది.
బలమైన వేర్ల వ్యవస్థతో పంటలకు రక్షణ
కాకినాడ జిల్లా యలేశ్వరం మండలంలో బీపీటీ-5204 వరి పంటపై నిర్వహించిన పరిశీలనలో ప్రకృతి వ్యవసాయ పంటల బలమైన వేర్ల వ్యవస్థ స్పష్టమైంది. ప్రకృతి వ్యవసాయ రైతు బుగత అరుణ పొలంలో ఒక్కో మొక్కకు 61 పిలకలు ఉండగా, 55 ప్రభావవంతమైన పిలకలుగా నమోదయ్యాయి. వేర్ల పొడవు 18 సెంటీమీటర్లు, ఒక్కో వెన్నుకు 285 గింజలు ఉన్నాయి. తుఫాను ప్రభావంతో కేవలం ఆరు పిలకలు మాత్రమే దెబ్బతిన్నాయి.
అదే రకాన్ని రసాయన పద్ధతిలో సాగు చేసిన బుగత రామనాయుడు పొలంలో ఒక్కో మొక్కకు 46 పిలకలు, 34 ప్రభావవంతమైన పిలకలు మాత్రమే నమోదయ్యాయి. వేర్ల పొడవు 13 సెంటీమీటర్లు, ఒక్కో వెన్నుకు 242 గింజలు వచ్చాయి. ఈ పొలంలో 12 పిలకలు దెబ్బతినగా, సుమారు 80 శాతం పంట నేలవాలింది.
గంటకు 135 కిలోమీటర్ల గాలులనూ తట్టుకున్న పంటలు
పల్నాడు జిల్లాలో గరిష్ఠంగా 147.45 మిల్లీమీటర్ల వర్షపాతం, గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా గుండ్లపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ వరి పంటలు నిలకడగా ఉన్నాయి. చిరుమామిళ్ల, సోలస గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన పత్తి పంటలు కూడా తుఫాను ప్రభావాన్ని తట్టుకున్నాయి.
అనకాపల్లి జిల్లాలో 261.5 మిల్లీమీటర్ల వర్షపాతం, గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు నమోదయ్యాయి. అయినప్పటికీ దేవరపల్లి మండలం మారేపల్లిలో ప్రకృతి వ్యవసాయ రైతు తరమణ వరలక్ష్మి సాగు చేసిన 1264 రకం వరి పంట నిలబడింది. అదే గ్రామంలో రసాయన పద్ధతిలో సాగు చేసిన వరి పంట పూర్తిగా నేలకొరిగింది.
బాపట్ల జిల్లా సుండూరు మండలం మోడుకూరులో రైతు, శాస్త్రవేత్త ఎల్.రాజ్‌కుమార్ సాగు చేసిన బీపీటీ-5204 వరి పంట రెండు తుఫానుల ప్రభావాన్ని తట్టుకుని ఎలాంటి నష్టం లేకుండా నిలిచింది. అదే రకాన్ని రసాయన పద్ధతిలో సాగు చేసిన వై.నాంచారయ్య పొలంలో అర్నబ్ తుఫానుతో 85 శాతం, మురసు తుఫానుతో మరో 10 శాతం నష్టం వాటిల్లింది. భట్టిప్రోలు మండలం వెల్లటూరులో ప్రకృతి వ్యవసాయ పంటకు 10 నుంచి 15 శాతం మాత్రమే నష్టం జరగ్గా, రసాయన సాగులో సుమారు 80 శాతం పంట దెబ్బతింది.
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం వెల్లమిల్లిలో ప్రకృతి వ్యవసాయ రైతు పి.రాజేంద్రప్రసాద్ సాగు చేసిన సంపత్ స్వర్ణ వరి పంట రెండు తుఫానుల ప్రభావాన్ని తట్టుకుని నిలబడింది. అదే రకాన్ని రసాయన పద్ధతిలో సాగు చేసిన పొలంలో పంట పూర్తిగా దెబ్బతింది. శ్రీకాకుళం జిల్లా గార మండలం బోరవెల్లి, బైరి గ్రామాల్లోనూ ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన వరి పంటలు తుఫానుల తర్వాత కూడా పచ్చగా, ఆరోగ్యంగా కనిపించాయి.
నేల ఆరోగ్యమే ప్రధాన బలం
ప్రకృతి వ్యవసాయంలో విత్తనాల ముందస్తు శుద్ధి, ద్రవ జీవామృతం, ఘన జీవామృతం, వృక్ష ఆధారిత కషాయాల వినియోగం వంటి పద్ధతులు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. నేలలో సేంద్రియ కర్బన పదార్థం, సూక్ష్మజీవుల చురుకుదనం పెరగడం వల్ల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. మొక్కల వేర్లు లోతుగా, బలంగా విస్తరించడంతో పాటు కాండం, కొమ్మలు కూడా దృఢంగా అభివృద్ధి చెందుతాయి. ఫలితంగా భారీ వర్షాలు, బలమైన గాలుల సమయంలో పంటలు నేలకొరిగే ప్రమాదం కొంతమేర తగ్గుతుందని వివరిస్తున్నారు.
60 లక్షల మంది రైతులకు విస్తరణ
వరుస తుఫానులు, భారీ వర్షాలు, వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి సవాలుగా మారుతున్న నేపథ్యంలో పంటల స్థిరత్వానికి ప్రకృతి వ్యవసాయం దోహదపడుతుందనే అభిప్రాయం ఈ పరిశీలనలతో బలపడుతోంది. పంట నష్టాలను తగ్గించడంతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడటం, సాగు వ్యయాన్ని తగ్గించడం, రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించడం ఈ విధానం లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మొత్తం 60 లక్షల మంది రైతులకు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తుఫానులు, ప్రకృతి విపత్తులను తట్టుకునే వ్యవసాయ విధానాల వైపు రైతులను ప్రోత్సహించేందుకు ఈ అనుభవాలు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.