ఆంధ్రప్రదేశ్

కూటమికి అసలు పరీక్ష ఇప్పుడే!

బెజవాడ ఎక్స్‌ప్రెస్ బ్యూరో · నవంబర్ 14, 2026 · 2 రోజులు క్రితం

రూ.32.49 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు

కార్యరూపం దాల్చేదెన్నడు? ఉద్యోగాలు వచ్చేదెప్పుడు?

ఎం.గణేశ్, జర్నలిస్టు

పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్నప్పటికీ, ఆ ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో పరిశ్రమలుగా మార్చడమే కూటమి ప్రభుత్వానికి అసలు పరీక్షగా మారింది. సీఐఐ సదస్సుల ద్వారా కోట్లాది రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. అయితే గతంలో కుదిరిన ఒప్పందాల్లో 40 శాతానికి మించి కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత ప్రతిపాదనలకూ అదే గతి పడితే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. సింగిల్ విండో విధానంలో వేగంగా అనుమతులు ఇస్తున్నా, అవన్నీ పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభించి యువతకు ఉపాధి కల్పించినప్పుడే అసలైన ప్రగతి సాధ్యమవుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

విశాఖ సదస్సులో భారీ ఒప్పందాలు:

విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీల్లో జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.9.89 లక్షల కోట్ల విలువైన 303 అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

తొలి రోజు 73 ఒప్పందాలు, 15 జీవోల ద్వారా రూ.5,84,355 కోట్ల ప్రతిపాదనలు (1,07,693 ఉద్యోగాల అంచనా) వచ్చాయి. ఇందులో తయారీ రంగానికి రూ.3.57 లక్షల కోట్లు, పునరుత్పాదక ఇంధన రంగానికి రూ.1.65 లక్షల కోట్లు ఉన్నాయి.

రెండో రోజు 12 ఒప్పందాల ద్వారా రూ.1,41,585 కోట్ల ప్రతిపాదనలు (10,919 ఉద్యోగాల అంచనా) వచ్చాయి. డేటా సెంటర్లు, టెలికాం కేంద్రాల కోసం ఎయిర్‌ ట్రంక్‌ ఇండియా–జేసీకే ఇన్‌ఫ్రా సంస్థ రూ.1,03,018 కోట్ల పెట్టుబడిని ప్రతిపాదించింది. కియా మోటర్స్, జిందాల్ గ్రూప్, ఇండియన్ ఆయిల్, గ్రీన్‌జెన్, డిక్సన్ టెక్నాలజీస్ వంటి దిగ్గజ సంస్థలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి.

ఇప్పటివరకు పెట్టుబడుల లెక్క ఇదీ:

2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి మొత్తం రూ.32.49 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. సదస్సుకు ముందు వచ్చిన 714 ప్రాజెక్టులలో (రూ.22.60 లక్షల కోట్లు), 526 ప్రాజెక్టులు (రూ.17.10 లక్షల కోట్లు) అనుమతులు, భూ కేటాయింపుల దశకు చేరాయి. వీటిలో 303 ప్రాజెక్టులు (సుమారు రూ.7.10 – 7.30 లక్షల కోట్లు) నిర్మాణ దశకు సిద్ధంగా ఉండగా, 272 ప్రాజెక్టులు కార్యకలాపాలు ప్రారంభించాయి. అనుమతులు పొందిన ప్రాజెక్టులలో గ్రౌండింగ్ శాతం నవంబర్ నాటికి 55 శాతానికి చేరిందని సీఎం పేర్కొన్నారు.

అయితే, ఈ 55 శాతం అనేది అనుమతులు పొందిన ప్రాజెక్టుల సంఖ్యకు మాత్రమే సంబంధించినదని, మొత్తం ప్రతిపాదిత పెట్టుబడి విలువలో అంత శాతం పరిశ్రమలుగా మారాయని భావించలేమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగితాలపై ఉన్న ఈ భారీ అంకెలు వాస్తవ రూపం దాల్చి నిరుద్యోగులకు ఉపాధి లభించినప్పుడే ప్రభుత్వానికి పూర్తిస్థాయి క్రెడిట్ దక్కుతుంది.