నిత్యావసర సరుకుల ధరలు, నిల్వలపై విజిలెన్స్ కొరడా

రూ. 10.43 కోట్ల విలువైన సరుకులు సీజ్
డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
ఎం.గణేశ్, జర్నలిస్టు
రాష్ట్ర ప్రజలకు నిత్యావసర వస్తువులు సరసమైన ధరలకు, నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు, విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వుల మేరకు మార్కెట్లో ధరల పెరుగుదల, అక్రమ నిల్వలపై అధికారులు నిరంతర నిఘా ఉంచారు. అక్టోబర్ 26, 2026 నుండి ఇప్పటివరకు మొత్తం 294 విజిలెన్స్ బృందాలు రాష్ట్రంలోని 248 మార్కెట్లు/ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఈ దాడుల్లో 516 కేసులు నమోదు కాగా, దాదాపు రూ. 104310528 విలువైన సరుకులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తనిఖీల వివరాలు & నమోదైన కేసులు:
పరిశీలించిన వ్యాపార సంస్థలు: 714 హోల్‌సేల్ దుకాణాలు, 144 రిటైల్ షాపులు, 17 రైస్ మిల్లులు, 13 గోదాములు.
గుర్తించిన ఉల్లంఘనలు: అక్రమ నిల్వలు/బ్లాక్ మార్కెటింగ్‌కు సంబంధించి 3 కేసులు, ధరల అసాధారణ పెరుగుదలపై 1 కేసు, కృత్రిమ కొరత సృష్టించడంపై 1 కేసుతో పాటు మొత్తం 516 కేసులు నమోదయ్యాయి.
స్వాధీనం చేసుకున్న సరుకుల వివరాలు:
ధాన్యం: 2,017.755 మెట్రిక్ టన్నులు
బియ్యం: 159.204 టన్నులు
పసుపు: 9.3 మెట్రిక్ టన్నులు
వంట నూనె: 1,930 లీటర్లు
పప్పులు: 831.45 కిలోలు
అక్రమ రవాణా సరుకులు: 1,050 కిలోలు అక్రమార్కులపై కఠిన చర్యలు – డీజీ హెచ్చరిక నిత్యావసర వస్తువుల కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం, బ్లాక్ మార్కెటింగ్ వంటి చర్యలకు పాల్పడే వారిపై నిఘా కొనసాగుతుందని విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ డీజీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. అవసరమైతే సివిల్ సప్లైస్, జీఎస్టీ , ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ, రెవెన్యూ మరియు పోలీస్ శాఖల సహకారంతో సామాన్యులకు ధరలు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.