ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్

వ్యక్తి నుంచి వ్యవస్థగా ఎదిగిన చలసాని ఆంజనేయులు:

బెజవాడ ఎక్స్‌ప్రెస్ బ్యూరో · July 4, 2026 · 2 months క్రితం

ఒక నాయకుడి ప్రస్థానం… లక్షలాది రైతుల భవిష్యత్తు –

రైతు సంక్షేమమే ధ్యేయంగా విజయగాథ

విజయ డెయిరీ చైర్మన్ జన్మదినోత్సవ ప్రత్యేక కథనం

ఎం.గణేశ్, జర్నలిస్టు

ఒక వ్యక్తి నాయకత్వం ఓ సాధారణ సంస్థను మార్చగలదు. కానీ అదే నాయకత్వం లక్షలాది రైతుల జీవితాలను మార్చి, సహకార రంగానికే కొత్త దిశను చూపితే అది చరిత్ర అవుతుంది. అలాంటి అరుదైన ప్రస్తానాన్ని సొంతం చేసుకుని, కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ)ను అగ్రపథంలో నిలిపిన చైర్మన్ చలసాని ఆంజనేయులు జన్మదినోత్సవం నేడు. సాధారణ పాడి రైతుగా మొదలైన ఆయన ప్రయాణం నేడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సహకార రంగ నాయకుడిగా ఎదిగింది. రైతు సమస్యలపై పోరాడిన ఉద్యమకారుడిగా, సహకార వ్యవస్థను బలోపేతం చేసిన నిర్వాహకుడిగా, ఆధునిక పాల పరిశ్రమకు మార్గదర్శకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.

ఆర్థిక రికార్డుల విజయ విహారం:

ఒకప్పుడు రూ.600-700 కోట్ల టర్నోవర్‌తో పరిమితమైన విజయ డెయిరీ, చలసాని ఆంజనేయులు గారి సమర్థవంతమైన నాయకత్వంలో రూ.1,273 కోట్ల వార్షిక వ్యాపారాన్ని నమోదు చేసే స్థాయికి చేరుకుంది. సంస్థ నెట్‌వర్త్ రూ.95 కోట్ల నుంచి రూ.256 కోట్లకు పెరగగా, స్థిరాస్తుల విలువ రూ.64 కోట్ల నుంచి రూ.320 కోట్లకు పెరిగింది. రూ.250 కోట్లకు పైగా మిగులు నిధులతో దేశంలోనే ఆర్థికంగా అత్యంత బలమైన సహకార డెయిరీల్లో విజయ డెయిరీ ఒకటిగా నిలిచింది.

రైతు సంక్షేమమే పరమావధి: ఈ అద్భుత అభివృద్ధి వెనుక కేవలం వ్యాపార విస్తరణ మాత్రమే కాదు, రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా తీసుకున్న పాలన ఉందని పాలకవర్గ సభ్యులు కొనియాడారు. సకాలంలో పాల ఉత్పత్తిదారులకు చెల్లింపులు, రాష్ట్రంలోనే అత్యధిక పాల ధరలు అందించడం, ఏడాదికి మూడుసార్లు బోనస్ ఇవ్వడం వంటి విప్లవాత్మక చర్యలు ఆయనకే సాధ్యమయ్యాయి. వీటితో పాటు ఉచిత పశువైద్య సేవలు, పశువుల బీమా, రైతు కుటుంబాలకు విద్యా సహాయం, మరణానంతర ఆర్థిక భరోసా, ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక తోడ్పాటు వంటి సంక్షేమ కార్యక్రమాలలో వేలాది పాల ఉత్పత్తిదారుల జీవితాల్లో విజయ డెయిరీ నిజమైన భరోసాగా నిలిచింది.

సాంకేతిక విప్లవం –

వీరవల్లి మెగా డెయిరీ: చలసాని ఆంజనేయులు నాయకత్వంలో నిర్మితమైన వీరవల్లి మెగా డెయిరీ ఈ విజయగాథలో మరో మైలురాయి. రూ.163 కోట్లతో నిర్మించిన ఈ అత్యాధునిక ప్లాంట్ రోజుకు 6 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ సామర్థ్యంతో పనిచేస్తూ, భవిష్యత్తులో 10 లక్షల లీటర్ల వరకు విస్తరించేలా రూపుదిద్దుకుంది. ఆటోమేషన్, డిజిటల్ నియంత్రణ, విలువ ఆధారిత పాల ఉత్పత్తుల తయారీతో దేశంలోనే అత్యాధునిక సహకార డెయిరీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. పాల ప్రాసెసింగ్ వ్యయాన్ని సగానికి తగ్గించడం ద్వారా రైతులకు అధిక ధరలు చెల్లించడం, లాభాలను బోనస్ రూపంలో తిరిగి రైతులకే పంచడం వంటి నిర్ణయాలు విజయ డెయిరీని ఇతర సహకార సంస్థలకు ఆదర్శంగా నిలిపాయి.

సంక్షోభంలో చెదరని సంకల్పం:

బుడమేరు వరదల వంటి విపత్కర పరిస్థితులలో కూడా పాల సేకరణ, ప్రాసెసింగ్, సరఫరాను నిరంతరాయంగా కొనసాగించి రైతులకు అండగా నిలవడం సంస్థ సామర్థ్యానికి, ఆయన సంకల్ప బలానికి నిదర్శనంగా నిలిచింది. వ్యాపారాభివృద్ధితో పాటు డిజిటల్ మార్కెటింగ్, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ, ఇతర రాష్ట్రాల్లో మార్కెట్ విస్తరణ ద్వారా విజయ బ్రాండ్‌ను కొత్త తరానికి చేరువ చేశారు. ఒక సాధారణ రైతు నుంచి సహకార రంగానికి దిశానిర్దేశం చేసే నాయకుడిగా… ఒక వ్యక్తి నుంచి ఒక వ్యవస్థగా ఎదిగిన చలసాని ఆంజనేయుల ప్రస్థానం, రైతు సంక్షేమం ఆధారంగా సహకార రంగాన్ని ఎలా అభివృద్ధి చేయవచ్చో చూపించిన విజయవంతమైన నమూనా. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పాడి రైతులు, డెయిరీ సిబ్బంది, సహకార రంగ ప్రముఖులు ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.