స్వర్ణ కుప్పం దిశగా అడుగులు..

రూ.118 కోట్ల మోడల్ బస్ స్టేషన్‌కు సీఎం శంకుస్థాపన!
బెజవాడ ఎక్స్ ప్రెస్, విజయవాడ
కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి “స్వర్ణ కుప్పం”గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కుప్పం పర్యటనలో భాగంగా ఆయన శనివారం రూ.118 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అత్యాధునిక ఆర్టీసీ మోడల్ బస్ స్టేషన్, డిపోకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

80 వేల మందికి ఉపాధి.. క్యూ కట్టనున్న పరిశ్రమలు
కుప్పంలో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా, భవిష్యత్తులో ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ఉద్యోగాల కోసం కుప్పానికి వచ్చేలా ఇక్కడి పరిశ్రమలను అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. కేవలం ఒక్క రోజులోనే రూ.9,322 కోట్ల పెట్టుబడులతో కూడిన 30 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మరియు ఎంఓయూలు (MoUs) జరిగాయని ఆయన వెల్లడించారు. వీటి ద్వారా సుమారు 80 వేల మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. అడిడాస్ ఫుట్‌వేర్, టూ-సీటర్ ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ సంస్థలతో పాటు డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్, పౌల్ట్రీ పరిశ్రమలు కుప్పంలో అడుగుపెడుతున్నాయని పేర్కొన్నారు.
కుప్పంలో బంగారు గనులు!
కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ ఫీల్డ్స్ ప్రారంభమైన తరహాలోనే, కుప్పం పరిసర ప్రాంతాలలోనూ బంగారు గనుల అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాటిని వెలికితీసి, “స్వర్ణ కుప్పం” సాధనకు నాంది పలుకుతామన్నారు. వీటితో పాటు బ్లూ గ్రానైట్ క్లస్టర్, మైక్రో ఇరిగేషన్, హంద్రీ-నీవా ప్రాజెక్ట్ ద్వారా సాగునీటి విస్తరణ, ఉద్యాన పంటల ప్రోత్సాహం మరియు డెయిరీ రంగానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు.
విపక్షాలపై నిప్పులు.. రాజధానిపై స్పష్టత
ఈ సందర్భంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలతో కుప్పం అభివృద్ధిని అడ్డుకుందని, కేవలం సినిమా సెట్టింగులు చూపిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించిందని ఆరోపించారు. “రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాల యుగం ముగిసింది.. ఇకపై అభివృద్ధే మన ఏకైక అజెండా” అని ఆయన స్పష్టం చేశారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగుతుందని, రాజధానిపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు.