ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్

అమరావతిలో జర్నలిస్టుల హౌసింగ్ ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలి

బెజవాడ ఎక్స్‌ప్రెస్ బ్యూరో · July 5, 2026 · 2 months క్రితం

ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీనియర్ జర్నలిస్టుల విజ్ఞప్తి

2019లో కేటాయించిన 30 ఎకరాల్లో హ్యాపీనెస్ట్ తరహాలో గృహ నిర్మాణాలు చేపట్టాలని తీర్మానం

ఎం.గణేశ్,

అమరావతి రాజధానిలో జర్నలిస్టుల కోసం ప్రతిపాదించిన హౌసింగ్ ప్రాజెక్టును ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని సీనియర్ జర్నలిస్టులు కోరారు. అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు. సమావేశంలో మాట్లాడిన అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ కార్యదర్శి పాటిబండ్ల నాగశ్రీనివాసరావు మాట్లాడుతూ, 2019లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం జీఓ ఎంఎస్ నెం.67 ద్వారా అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి 30 ఎకరాల భూమిని కేటాయించిందని గుర్తు చేశారు. అనంతరం సీఆర్డీఏ ఆధ్వర్యంలో బహుళ అంతస్తుల గృహ సముదాయాల నిర్మాణం చేపట్టేందుకు ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తూ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. తదుపరి జీఓ ఎంఎస్ నెం.107 ద్వారా జర్నలిస్టులకు నాలుగు కేటగిరీల్లో హ్యాపీనెస్ట్ నమూనాలో అపార్ట్‌మెంట్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, రాజకీయ పరిణామాల కారణంగా ప్రాజెక్టు ముందుకు సాగలేదన్నారు. ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణ పనులు మళ్లీ వేగం పుంజుకున్న నేపథ్యంలో జర్నలిస్టుల హౌసింగ్ ప్రాజెక్టును కూడా ప్రాధాన్యతతో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ డైరెక్టర్, విశాలాంధ్ర బ్యూరో చీఫ్ చావా రవి మాట్లాడుతూ, అమరావతిలో హ్యాపీనెస్ట్‌తో పాటు ఇతర గృహ నిర్మాణ ప్రాజెక్టులు వేగంగా కొనసాగుతున్నాయని, అదే తరహాలో జర్నలిస్టుల హౌసింగ్ ప్రాజెక్టును కూడా తక్షణమే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. సమావేశంలో అమరావతికి చట్టబద్ధ రాజధాని హోదా కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఏర్పాటు, పేదల గృహ నిర్మాణాలు, హ్యాపీనెస్ట్, ఏపీఎన్‌ఆర్‌టీఐ ఐకాన్ ప్రాజెక్టులు వంటి అభివృద్ధి కార్యక్రమాలను స్వాగతించారు. ఇదే క్రమంలో జర్నలిస్టుల హౌసింగ్ ప్రాజెక్టుకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. 2019 నుంచి ఇప్పటి వరకు పలువురు జర్నలిస్టులు పదవీ విరమణ చేయడం, మరికొందరు కరోనా మహమ్మారి సమయంలో మృతి చెందడం వల్ల వారి కుటుంబాలు కూడా ఈ ప్రాజెక్టు అమలుపై ఆశగా ఎదురుచూస్తున్నాయని సమావేశంలో ప్రస్తావించారు. జర్నలిస్టులు అమరావతి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారని, ప్రపంచ స్థాయి రాజధానికి తగిన విధంగా దేశానికే ఆదర్శంగా నిలిచే జర్నలిస్టుల కాలనీని నిర్మించాలని ముఖ్యమంత్రిని కోరారు.

ఈ సమావేశంలో అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ డైరెక్టర్లు ఈశ్వర్ (టీవీ9), నరసింహారావు (హెచ్‌ఎంటీవీ), శ్రీనివాస్ (మహా టీవీ), ది హిందూ డిప్యూటీ ఎడిటర్ శ్రీనాథ్, స్పెషల్ కరస్పాండెంట్ సాంబశివరావు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ డిప్యూటీ రెసిడెంట్ ఎడిటర్ మల్లేశ్వరరావు, సీనియర్ సబ్ ఎడిటర్ అమీన్, బీబీసీ ఇన్‌చార్జి జి. ఉమాకాంత్, టైమ్స్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ ఎడిటర్ శ్రీకాంత్, ది పయనీర్ చీఫ్ ఆఫ్ బ్యూరో రవికుమార్ బొప్పన, ఈనాడు సీనియర్ రిపోర్టర్ ఎం. శ్రీనివాసరావు, ఈటీవీ బ్యూరో చీఫ్ శ్రీనివాస మోహన్, ఆంధ్రప్రభ బ్యూరో చీఫ్ గోపీ, ఎన్‌టీవీ చీఫ్ రిపోర్టర్ ప్రసన్న, మహా టీవీ ఏపీ బ్యూరో చీఫ్ మురళీమోహన్, మాజీ విశాలాంధ్ర ఉపసంపాదకుడు ఎస్.కే. బాబు, దిశ సీనియర్ రిపోర్టర్ దారం వెంకటేశ్వరరావు, సీవీఆర్ బ్యూరో ఏడుకొండలు, సహకార భూమి ఎడిటర్ అక్బర్ పాషా, మాజీ ఆంధ్రభూమి న్యూస్ ఎడిటర్ నరసింహారావు, వార్త బ్యూరో చీఫ్ గంటా విజయ్ కుమార్, ప్రజాశక్తి స్టేట్ బ్యూరో పవన్, మాజీ డెక్కన్ క్రానికల్ బ్యూరో ఇన్‌చార్జి కృష్ణారావు, ఫొటోగ్రాఫర్లు దయానంద్, వెంకట్రామయ్య, ఆంధ్రపత్రిక సీఈఓ మాధవ్, 99 టీవీ బ్యూరో జి. సాంబశివరావు, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మరికొందరు సీనియర్ జర్నలిస్టులు సందేశాల ద్వారా తమ సంఘీభావాన్ని తెలియజేశారు.