ఉండవల్లి గుహల్లో ఘనంగాప్రారంభమైన తెలుగు మహోత్సవం

- రెండు రోజుల వేడుకలకు అంగరంగ వైభవంగా శ్రీకారం
- సూర్యోదయ సుప్రభాతంతో ప్రారంభమైన సాహిత్య , సాంస్కృతిక సంబరం
- తెలుగు భాష, సాహిత్యం, కళల వైభవాన్ని ప్రతిబింబించిన కార్యక్రమాలు

గుంటూరు జిల్లా చారిత్రక ఉండవల్లి గుహల్లో రెండు రోజుల తెలుగు మహోత్సవం శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలు తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో చేపట్టారు. ఉదయం ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు నిర్వహించిన సూర్యోదయ సుప్రభాతంతో మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, గద్దె అనురాధ, చిల్లపల్లి శ్రీనివాస్, గజల్ శ్రీనివాస్, కేజీబీ సరిత, ఎండీ విల్సన్ తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. తెలుగు భాష ప్రాచీనతను, సాహిత్య వారసత్వాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ లక్ష్మీశా అన్నారు.

యువతలో మాతృభాషపై అభిమానం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.మహిళా రచయిత్రులతో నిర్వహించిన “ఆమె మాట – అక్షర బాట” సాహిత్య చర్చా వేదిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళల సాహిత్య ప్రస్థానం, రచనా రంగంలో వారి పాత్రపై రచయిత్రులు అభిప్రాయాలు పంచుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కవులు “చెట్టు నీడన చిరుగాలి కవిత్వ గానం” కార్యక్రమంలో సామాజిక అంశాలపై కవితలు వినిపించారు.పిల్లల కోసం పంచతంత్ర, నీతికథల కార్యక్రమాలు, సుందరకాండ ఆధారంగా తోలుబొమ్మలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. “తెలుగు స్వరాల సంగీత సంబరం” కార్యక్రమంలో తెలుగు సినీ గేయాలు, ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. తెలుగు సాహిత్యం, సంస్కృతి, సంగీతం, జానపద కళల వైభవాన్ని ప్రతిబింబిస్తూ తొలి రోజు మహోత్సవం విజయవంతంగా ముగిసింది.