ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్

ఉక్కు రాష్ట్రంగా ఏపీ..

బెజవాడ ఎక్స్‌ప్రెస్ బ్యూరో · July 3, 2026 · 48 minutes క్రితం

ఉక్కు రాష్ట్రంగా ఏపీ.. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనులకు శ్రీకారం

కడప, జూలై 3: ఆంధ్రప్రదేశ్‌ను ఉక్కు రంగంలో అగ్రస్థానానికి తీసుకెళ్లే దిశగా కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపు రాళ్లపల్లిలో జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. జేఎస్‌డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ జిందాల్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

రూ.16,350 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో నిర్మించనున్న ఈ ప్లాంట్ ఏడాదికి 2 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్లాంట్‌తో పాటు గ్రీన్ ఎనర్జీ ఆధారంగా విద్యుత్‌ను వినియోగించే అనుబంధ ప్రాజెక్టులను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 2,700 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ కోసం దశాబ్దాలుగా ఎదురుచూసిన ప్రజల ఆకాంక్ష నెరవేరిందన్నారు. విశాఖ ఉక్కు, అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, రాయలసీమలో జేఎస్‌డబ్ల్యూ ప్లాంట్‌తో ఆంధ్రప్రదేశ్ ఉక్కు రాష్ట్రంగా అవతరిస్తుందని పేర్కొన్నారు. గండికోట నుంచి ప్లాంట్‌కు నీటి సరఫరా, రోడ్డు, రైలు, పోర్టు అనుసంధానం కల్పిస్తామని, స్థానికంగా లభించే ఇనుప ఖనిజాన్ని పరిశ్రమ అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.