Uncategorized

క్రీడలతో దేహదారుఢ్యం.. ఒత్తిడికి దూరం

బెజవాడ ఎక్స్‌ప్రెస్ బ్యూరో · July 11, 2026 · 1 month క్రితం

సిబ్బందిలో స్నేహభావాన్ని పెంపొందించే క్రీడా పోటీలు అదనపు డీజీపీ మహేష్‌ చంద్ర లడ్డా..

ఉత్సాహంగా ఎస్‌ఎస్‌జీ వార్షిక క్రీడోత్సవం–2026

అమరావతి, జూలై 11, 2026: విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించడంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని అదనపు డీజీపీ మహేష్‌ చంద్ర లడ్డా పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్‌ విభాగంలోని సిబ్బంది మధ్య స్నేహభావం, ఐక్యతను పెంపొందించేందుకు క్రీడా పోటీలు మంచి వేదికగా నిలుస్తాయన్నారు.

10.07.2026న మంగళగిరిలోని ఎస్‌ఎస్‌జీ మైదానంలో స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌ (ఎస్‌ఎస్‌జీ) ఆధ్వర్యంలో వార్షిక క్రీడోత్సవం–2026 ఉత్సాహంగా నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి అదనపు డీజీపీ మహేష్‌ చంద్ర లడ్డా ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఐజీపీ పీహెచ్‌డీ రామకృష్ణ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఎస్‌ఎస్‌జీ డైరెక్టర్‌ జగదీశ్‌ అదహళ్లి, ఎస్పీ చెన్నుపాటి భద్రయ్య నేతృత్వంలో కార్యక్రమం జరిగింది.

సంప్రదాయ తాడు లాగుడు పోటీలను మహేష్‌ చంద్ర లడ్డా ప్రారంభించారు. ఈ పోటీలో ఆర్‌ఐ పోతురాజు నేతృత్వంలోని జట్టు విజేతగా నిలిచింది. అనంతరం పాటలు, ఫ్యాన్సీ డ్రెస్‌, నృత్య ప్రదర్శనలతో సిబ్బంది తమ ప్రతిభను చాటారు.

25 క్రీడాంశాలు.. 132 బహుమతులు…
ట్రాక్‌, ఫీల్డ్‌ ఈవెంట్లు సహా మొత్తం 25 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. విజేతలు, రన్నరప్‌లతో పాటు ఇంటెలిజెన్స్‌ విభాగ మినిస్టీరియల్‌ సిబ్బంది, హోంగార్డులు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కలిపి మొత్తం 132 బహుమతులు అందజేశారు.

ఓవరాల్ ఛాంపియన్:
100, 200, 400 మీటర్ల పరుగుతో పాటు 4×400 మీటర్ల రిలే, లాంగ్‌జంప్‌, ఫ్యాన్సీ డ్రెస్‌ పోటీల్లో ఆరు ప్రథమ బహుమతులు సాధించిన ఎస్‌.కమలేంద్రరావు ఓవరాల్‌ ఛాంపియన్‌గా నిలిచారు.

క్రీడల్లో సిబ్బంది ప్రదర్శించిన ఉత్సాహాన్ని మహేష్‌ చంద్ర లడ్డా అభినందించారు. ఈ క్రీడోత్సవం తన ఉద్యోగ జీవిత తొలినాళ్లను గుర్తుచేసిందని పేర్కొన్నారు. విజేతలకు అభినందనలు తెలిపి, భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. అనంతరం అధికారులు, సిబ్బంది కలిసి ‘బడా ఖానా’లో పాల్గొన్నారు.

కార్యక్రమంలో ఐఎస్‌డబ్ల్యూ ఎస్పీ కె.ఆరిఫ్‌ హఫీజ్‌, సీఐ సెల్‌ డీఐజీ పి.ప్రకాశ్‌, ఎస్‌ఐబీ ఎస్పీ వి.గీతాదేవి, సీఐ సెల్‌ ఎస్పీ కె.శ్రీనివాసరావు, పొలిటికల్‌ ఎస్పీ జె.రామ్మోహన్‌రావు, కమ్యూనల్‌ ఎస్పీ ఎ.రమాదేవి, అడ్మినిస్ట్రేషన్‌ ఎస్పీ కె.లావణ్యలక్ష్మితో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.