క్లెయిమ్స్‌పై వారంలోగా విచారణ

- ప్రతిరోజూ కనీసం 70 క్లెయిమ్స్, అభ్యంతరాలపై విచారణ జరిపి పరిష్కరించాలి
- క్లెయిమ్స్‌పై వారంలోగా విచారణ
- క్షేత్రస్థాయి విచారణలో స్టేట్మెంట్‌ను పక్కాగా నమోదు చేయాలి
- క్లెయిమ్స్, అభ్యంతరాల సమాచారాన్ని రాజకీయ పార్టీలకు అందజేయాలి
ఎం.గణేశ్, జర్నలిస్టు
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా అందిన క్లెయిమ్స్, అభ్యంతరాలను అత్యంత పారదర్శకంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకుడు ఎం.వి.శేషగిరి బాబు అధికారులను ఆదేశించారు.నోటీసు జారీ చేసిన ఏడు రోజుల్లోగా ప్రతి క్లెయిమ్, అభ్యంతరంపై విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు ప్రతిరోజూ కనీసం 70 క్లెయిమ్స్, అభ్యంతరాలపై విచారణ జరపాలని ఆదేశించారు.క్షేత్రస్థాయి విచారణలో సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను స్పష్టంగా, పక్కాగా నమోదు చేయాలని తెలిపారు.విచారణకు సంబంధించిన అన్ని వివరాలను రికార్డుల్లో నమోదు చేసి, ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచించారు.క్లెయిమ్స్, అభ్యంతరాలకు సంబంధించిన సమాచారాన్ని నిబంధనల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలోని ఫొటోల స్పష్టతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల ఓట్లు సాధ్యమైనంత వరకు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండేలా పరిశీలించాలని సూచించారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా కొత్త ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరారు.ప్రత్యేక సవరణ ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేందుకు అధికారులు, పోలింగ్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.