ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్

మినిమం బ్యాలెన్స్‌కు చెల్లుచీటి!

బెజవాడ ఎక్స్‌ప్రెస్ బ్యూరో · September 18, 2026 · 2 weeks క్రితం

ఎం.గణేశ్, జర్నలిస్టు

బ్యాంకు ఖాతాలో కనీస నిల్వ ఉంచాల్సిన అవసరం లేకుండా పొదుపు ఖాతా నిర్వహించాలనుకునే వారికి బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా (బీఎస్‌బీడీ) ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఖాతా ప్రారంభించేందుకు కనీస ప్రారంభ డిపాజిట్ కూడా అవసరం లేదు. ఈ ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వహించాల్సిన నిబంధన ఉండదు. దీంతో ఖాతాలో డబ్బు తక్కువగా ఉన్నా కనీస నిల్వ పేరుతో జరిమానా విధించే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్నవారు, విద్యార్థులు, రోజువారీ ఆదాయంపై ఆధారపడేవారు ఈ ఖాతా ద్వారా ప్రాథమిక బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవచ్చు. బీఎస్‌బీడీ ఖాతాదారులకు ఏటీఎం లేదా డెబిట్ కార్డు, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్‌బుక్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా చెక్‌బుక్ సదుపాయం కూడా పొందవచ్చు. ఖాతా నిర్వహణకు సంబంధించి వర్తించే ఉచిత సేవలు, లావాదేవీ పరిమితులను సంబంధిత బ్యాంకు వద్ద తెలుసుకోవచ్చు. ఉన్న ఖాతాను మార్చుకోవచ్చు. ఇప్పటికే సాధారణ పొదుపు ఖాతా ఉన్నవారు కూడా తమ బ్యాంకును సంప్రదించి బీఎస్‌బీడీ ఖాతాకు మారే అవకాశం ఉంది. అయితే ఒకే బ్యాంకులో సాధారణ పొదుపు ఖాతా, బీఎస్‌బీడీ ఖాతా రెండింటినీ ఒకేసారి నిర్వహించడంపై నిబంధనలు వర్తిస్తాయని ఆర్‌బీఐ తెలిపింది.

అన్ని బ్యాంకుల్లో అందుబాటులో

దేశంలోని అన్ని బ్యాంకుల్లో బీఎస్‌బీడీ ఖాతా సదుపాయం అందుబాటులో ఉందని ఆర్‌బీఐ పేర్కొంది. కనీస బ్యాలెన్స్ భారం లేకుండా బ్యాంకింగ్ సేవలను పొందాలనుకునే వారు ఈ ఖాతా గురించి తమ బ్యాంకులో వివరాలు తెలుసుకోవచ్చు.