తిరుపతి జిల్లా పోలీసుల కీలక చర్య: బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘించిన రౌడీ షీటర్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

శాంతి భద్రతల పరిరక్షణకు తిరుపతి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
- పదేపదే నేరాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా
- రౌడీ షీటర్లు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల గుర్తింపు
- బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు
- రేణిగుంటకు చెందిన రౌడీ షీటర్‌కు 14 రోజుల న్యాయ రిమాండ్
ఎం. గణేశ్, జర్నలిస్టు
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తిరుపతి జిల్లా పోలీసులు మరింత కఠిన చర్యలు చేపడుతున్నారు. జిల్లా పోలీసు అధికారి ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు పదేపదే నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులు, రౌడీ షీటర్లు, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిని గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు.నేర ప్రవృత్తికి దూరంగా ఉండి సత్ప్రవర్తనతో జీవించేలా మండల కార్యనిర్వాహక మేజిస్ట్రేట్ల ఎదుట నిర్దిష్ట కాలపరిమితికి బైండ్ ఓవర్ చర్యలు చేపడుతున్నారు. బైండ్ ఓవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి నేరాలకు పాల్పడిన వారిపై ఆధారాలతో సంబంధిత అధికారుల ఎదుట హాజరుపరిచి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నిందితుడిగా ఉన్న రేణిగుంట తారకరామ నగర్‌కు చెందిన సేతు దిలీప్ కుమార్ అలియాస్ తంబి (35)పై పోలీసులు బైండ్ ఓవర్ చర్యలు చేపట్టారు. రేణిగుంట మండల కార్యనిర్వాహక మేజిస్ట్రేట్ ఎదుట ఈ ఏడాది ఏప్రిల్ 13న సత్ప్రవర్తన నిమిత్తం బైండ్ ఓవర్ చేయించారు.అయితే బైండ్ ఓవర్ అమల్లో ఉన్న సమయంలోనే జూలై 6న తారకరామ నగర్‌లో జరిగిన ఘర్షణ కేసులో అతడి ప్రమేయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో బైండ్ ఓవర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రేణిగుంట పోలీసులు తగిన ఆధారాలతో అతడిని జూలై 16న మండల కార్యనిర్వాహక మేజిస్ట్రేట్ శ్రావణ్ కుమార్ ఎదుట హాజరుపరిచారు.నిబంధనల ఉల్లంఘనను పరిగణనలోకి తీసుకున్న మేజిస్ట్రేట్ అతడికి 14 రోజుల న్యాయ రిమాండ్ విధించారు. నిందితుడిని జైలుకు తరలించారు.చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, శాంతి భద్రతల పరిరక్షణ పోలీసుల ప్రథమ కర్తవ్యమని జిల్లా పోలీసు అధికారి ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. భవిష్యత్తులోనూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.ఈ చర్యల్లో భాగంగా రేణిగుంట ఉప పోలీసు అధికారి శ్రీనివాసరావు, రేణిగుంట పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎస్. జయచంద్ర చేపట్టిన చర్యలను జిల్లా పోలీసు అధికారి అభినందించారు.