ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్

శ్రీవారి భక్తులకు ఉపశమనం

బెజవాడ ఎక్స్‌ప్రెస్ బ్యూరో · August 7, 2026 · 1 week క్రితం
  • తిరుమల క్యూలైన్లలో శ్రీవారి భక్తులకు ఉపశమనం
  • ఫుడ్ కన్వేయర్వ్యవస్థ ప్రారంభం
  • తిరుమలలో భక్తులకు కొత్త సౌకర్యం

ఎం.గణేశ్, జర్నలిస్టు

తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలను వేగంగా అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన సాంకేతికతకు శ్రీకారం చుట్టింది. రద్దీ సమయాల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా ‘ఫుడ్ సర్వింగ్ కన్వేయర్ బెల్ట్’ వ్యవస్థను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. దాతల సహకారంతో శిలాతోరణం సమీపంలోని 45వ గేటు వద్ద 7 మీటర్ల పొడవు గల ఈ మూవింగ్ డైనింగ్ యంత్ర పనితీరును టీటీడీ అధికారులు పరిశీలించారు. అచ్చం కన్వేయర్ బెల్ట్ మాదిరిగా నిరంతరాయంగా తిరిగే ఈ యంత్రం ద్వారా శ్రీవారి సేవకులు ప్రసాదాలను సులువుగా భక్తులకు అందజేస్తున్నారు.

ప్రధాన ప్రయోజనాలు:

. సమయం ఆదా: సేవకులు భక్తుల వద్దకు వెళ్లి ఇచ్చే శ్రమ తగ్గి, తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి ప్రసాదాలు అందుతాయి.

. తోపులాటలకు చెక్: క్యూలైన్లలో అన్నప్రసాదాల పంపిణీ సమయంలో ఎలాంటి నెట్టోట, తోపులాటలు జరగవు.

. లక్షల మందికి నిరంతర సేవ: పీక్ రోజుల్లో దాదాపు 3.5 కిలోమీటర్ల మేర ఉండే క్యూలైన్లలో పాలు, మజ్జిగ, పులిహోర, ఉప్మా, సాంబారన్నం వంటి అన్నప్రసాదాల వితరణ సులభతరం కానుంది.

ఈ ప్రయోగం విజయవంతం కావడంతో క్యూలైన్లలోని మిగిలిన కీలక ప్రాంతాల్లో కూడా మరిన్ని ఫుడ్ సర్వింగ్ కన్వేయర్లను అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ నిర్ణయించింది.