పోలీసులకు చాగంటి అవగాహన

- పోలీసులకు చాగంటి అవగాహన
- మానసిక వత్తిడిని అధిగమించే కార్యక్రమం
- రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణ
ఎం.గణేశ్, జర్నలిస్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యా ప్తంగా శిక్షణ పొందుతున్న సుమారు 5,560 మంది ఎస్‌సీటీపీసీ కానిస్టేబుళ్లకు ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయం నుంచి నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ, పోలీసు విధుల్లో మానసిక ఒత్తిడి సహజమే అయినప్పటికీ, దానిని సమర్థవంతంగా అధిగమించే మార్గాలను అలవర్చుకోవాలని సూచించారు. నిజాయతీ, క్రమశిక్షణ, ఓర్పు అనే విలువలు ప్రతి పోలీసు అధికారి, సిబ్బందిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని పేర్కొన్నారు. ప్రజలు పోలీస్ స్టేషన్‌కు ఆశ్రయంగా వస్తారని, కష్టాల్లో ఉన్న వారి సమస్యలను ఓర్పుతో విని, సహానుభూతితో స్పందించడం ద్వారా “పోలీసు ఉన్నారనే భరోసా” ప్రతి పౌరుడిలో కల్పించగలమని అన్నారు. చిరాకు, ఆవేశం ప్రదర్శించడం వల్ల ఫిర్యాదుదారులు మరింత మనోవేదనకు గురవుతారని, అందువల్ల ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.పోలీసు సిబ్బంది మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి హాస్య రచనలు, మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని సూచించిన ఆయన, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ గురవా రెడ్డి రచించిన “గురవాయణం”, చిలకమర్తి లక్ష్మీనరసింహం హాస్య రచనలు, జంధ్యాల పుస్తకాలను చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఐజీ అంబురాజన్, ఏ.ఐ.జి. ట్రైనింగ్ సత్తిబాబు, రాష్ట్రంలోని 21 పోలీసు శిక్షణా కళాశాలల ప్రిన్సిపాల్స్, కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) డాక్టర్ మహంతి కిషోర్ కుమార్ కాకినాడ మూడవ బెటాలియన్ కమాండెంట్ మరియు ట్రైనింగ్ ప్రిన్సిపాల్ కె నవీన్ కుమార్, అడిషనల్ కమాండెంట్ ఎస్ దేవానంద రావు ఎస్‌బీ డీఎస్పీ కె.వి.వి. సత్యనారాయణ, మూడవ బెటాలియన్, కాకినాడ వైస్ ప్రిన్సిపాల్ (అసిస్టెంట్ కమాండెంట్) గంగరాజు ఇతర అధికారులు, సిబ్బంది మరియు రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ పొందుతున్న సుమారు 5,560 మంది (ఎస్‌సీటీపీసీ) సివిల్ మరియు ఏపీఎస్పీ ట్రైనీ కానిస్టేబుళ్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు