ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్

సీఎం

బెజవాడ ఎక్స్‌ప్రెస్ బ్యూరో · September 21, 2026 · 1 week క్రితం

టీచర్లపై దాడులు చేస్తే ఊరుకోం: చంద్రబాబు

డీఎస్సీ నియామకాలపై దుష్ప్రచారం..

చట్టబద్ధంగా ప్రశ్నించొచ్చు కానీ దాడులు చేయడమేంటి?

బెజవాడ ఎక్స్ ప్రెస్, బ్యూరో ప్రతినిధి

డీఎస్సీ క్రీడా కోటా ఉపాధ్యాయులపై విజయవాడలో జరిగిన దాడుల ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోమవారం కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు తమ కష్టార్జితమని చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. తమ ప్రభుత్వం జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్లలో అవినీతికి తావులేదని, తన పాలనలో ఎప్పుడూ ప్రశ్నపత్రం లీక్ కాలేదని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల నియామకాల్లో తమ ప్రభుత్వానికి స్పష్టమైన చరిత్ర ఉందన్నారు. నియామకాలు పూర్తయి ఏడాది గడిచిన తర్వాత ఇప్పుడు లేనిపోని ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. కర్నూలు కొండారెడ్డి బురుజు, విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం, విశాఖ సముద్రతీరం వద్ద ఉపాధ్యాయులు తమ నిరసనలను వ్యక్తం చేశారని తెలిపారు.చట్టబద్ధమైన నియామక ప్రక్రియపై ఎవరికైనా అనుమానాలు ఉంటే సాక్ష్యాధారాలతో ప్రశ్నించవచ్చని, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని చంద్రబాబు అన్నారు. అయితే ఉపాధ్యాయులపై దాడులు చేయించడం, రౌడీలను ప్రోత్సహించడం ఏమిటని ప్రశ్నించారు. ఉపాధ్యాయులపై దాడులను ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. అప్పటి పాలకులే రౌడీయిజానికి పాల్పడ్డారని విమర్శించారు. కుప్పంలోనూ గతంలో తనను ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా హింసాత్మక ధోరణులను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.

రౌడీయిజం, విధ్వంసక చర్యలకు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. అలాంటి వారిని ఎదుర్కొనే సత్తా కుప్పం ప్రజలకు ఉందన్నారు. ఫ్లెక్సీలకు పొట్టేళ్లను బలి ఇచ్చి రక్తాభిషేకం చేసే సంస్కృతిని కూడా ఆయన విమర్శించారు.

తిరుమల పవిత్ర లడ్డూను కూడా కల్తీ చేశారని చంద్రబాబు ఆరోపించారు. కుప్పం ప్రజలు ప్రతి ఎన్నికలోనూ సైకిల్ గుర్తుకు మద్దతుగా నిలిచారని, హిందూపురంతో పాటు కుప్పం నియోజకవర్గం తమకు నిరంతర మద్దతు ఇస్తున్న ప్రాంతమని పేర్కొన్నారు.