సీఐడీ

సీఐడీ
సైబర్ నేరాల దర్యాప్తుపై పోలీసులకు ఆధునిక శిక్షణ
మూడు రోజుల సైబర్ సెక్యూరిటీ, సైబర్ హైజీన్ శిక్షణ ముగింపు
సీఐడీ డీజీపీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్
ఎం.గణేశ్, జర్నలిస్టు
సైబర్ నేరాల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించేలా ఏపీ సీఐడీ అధికారులు, సిబ్బందికి మూడు రోజులపాటు నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ, సైబర్ హైజీన్ శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఏపీ సీఐడీ డీజీపీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు మంగళగిరిలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేగంగా మారుతున్న సైబర్ నేరాల తీరుకు అనుగుణంగా పోలీసు అధికారులు, సిబ్బందికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, దర్యాప్తు పద్ధతులపై నిరంతరం శిక్షణ అందించడమే కార్యక్రమం ఉద్దేశమని సీఐడీ అధికారులు తెలిపారు. ప్రముఖ సైబర్ భద్రతా నిపుణుడు, సైటెక్ ల్యాబ్స్ సీఈఓ సందీప్ మదుల్కర్ సైబర్ నేరాల దర్యాప్తు, సాంకేతిక అంశాలు, ఆధునిక భద్రతా విధానాలపై శిక్షణతోపాటు పలు సూచనలు, సలహాలు అందించారు.సీఐడీ ప్రధాన కార్యాలయంతోపాటు రాష్ట్రంలోని ఏడు ప్రాంతీయ కార్యాలయాల నుంచి కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు సుమారు 60 మంది అధికారులు, సిబ్బంది శిక్షణలో పాల్గొన్నారు. ఎస్పీలు ఆర్.గంగాధర్, పి.పరమేశ్వర్‌రెడ్డి, ఎస్.శ్రీధర్, అధిరాజ్ సింగ్ రాణా, ఎస్.వి.శ్రీధర్‌రావు, కె.చక్రవర్తి, కె.ఈశ్వర్రావు, డాక్టర్ కె.వి.శ్రీనివాసరావు తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.మూడు రోజుల శిక్షణలో డిజిటల్ అరెస్ట్ మోసాలు, వివిధ రకాల సైబర్ నేరాల విధానాలు, సమాచార సేకరణ, న్యాయపరమైన నోటీసులు, డిజిటల్ ఆధారాల సేకరణ, సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే నేరాల దర్యాప్తు, ఆర్థిక మోసాలు, బ్యాంకు ఖాతాల విశ్లేషణ తదితర అంశాలను వివరించారు. కాల్ డేటా రికార్డు, ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డు విశ్లేషణ, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్, వెబ్ ఇంటెలిజెన్స్, ఐపీ చిరునామాలు, వెబ్సైట్లు, ఈ-మెయిల్, వీవోఐపీ కాల్స్ దర్యాప్తుపైనా శిక్షణ ఇచ్చారు.
మాల్వేర్ విశ్లేషణ, డిజిటల్ ఫోరెన్సిక్స్, ఫోరెన్సిక్ సాధనాల వినియోగం, డార్క్‌వెబ్ దర్యాప్తు, సైబర్ నేరాల్లో నేరగాళ్ల అనామకత్వం, బ్లాక్‌చైన్ సాంకేతికత, క్రిప్టోకరెన్సీకి సంబంధించిన దర్యాప్తు అంశాలను కూడా వివరించారు. శిక్షణలో భాగంగా ప్రాయోగిక ప్రదర్శనలు, కేస్ స్టడీలు, ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించి దర్యాప్తులో సాంకేతిక సాధనాలను ఎలా వినియోగించాలో వివరించారు.సైబర్ నేరాల స్వభావం, నేరగాళ్లు ఉపయోగించే సాంకేతిక పద్ధతులు నిరంతరం మారుతున్నందున పోలీసు అధికారులు, సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ పేర్కొన్నారు. సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆధునిక దర్యాప్తు నైపుణ్యాలు, డిజిటల్ ఫోరెన్సిక్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడమే శిక్షణ లక్ష్యమన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సామర్థ్య పెంపుదల కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు.