ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్

ప్రతి ఇంటికీ ఓ పారిశ్రామికవేత్త తయారవ్వాలి: సీఎం చంద్రబాబు

బెజవాడ ఎక్స్‌ప్రెస్ బ్యూరో · September 21, 2026 · 1 week క్రితం

చిత్తూరు/కుప్పం: కుప్పం నియోజకవర్గ అభివృద్ధితో పాటు రైతులు, మహిళలు, యువత ఆర్థికంగా బలోపేతం కావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పంలో నిర్వహించిన స్వర్ణ కుప్పం బహిరంగ సభలో వివిధ పథకాల లబ్ధిదారులతో సీఎం నేరుగా సంభాషించారు. వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.

హంద్రీనీవా కాలువ ద్వారా సాగునీటి ప్రయోజనం పొందుతున్న ఓ రైతుతో సీఎం మాట్లాడారు. సాగు కోసం భూమిని అధికంగా రసాయన ఎరువులతో కలుషితం చేయవద్దని రైతులకు సూచించారు. వాతావరణ సమతుల్యత దెబ్బతినడం వల్లే ఎల్‌నినో వంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా కృష్ణా, గోదావరి నదులకు ఆశించిన స్థాయిలో నీరు రాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.

భూమి సారాన్ని కాపాడటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రకృతి సేద్యం దోహదపడుతుందని చంద్రబాబు అన్నారు. సేంద్రీయ ఎరువులను వినియోగించడం ద్వారా భూమిలో జీవ వైవిధ్యాన్ని పెంచాలని సూచించారు. ‘ప్రకృతి సేద్యం శ్రీరామ రక్ష’ అనే విధానాన్ని పాటించాలని రైతులకు పిలుపునిచ్చారు. బయోచార్ వంటి విధానాలను వినియోగించి భూమిలో సారం, తేమను పెంచుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 20 లక్షల మంది ప్రకృతి సేద్యం చేస్తున్నారని సీఎం తెలిపారు. ఈ సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పీఎండీఎస్ విధానాన్ని అమలు చేస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. భూములను ఖాళీగా ఉంచకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసి వాటిని ఎప్పుడూ పచ్చగా ఉండేలా చూడాలని కోరారు. కరవు నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలతో కార్యక్రమాలను అమలు చేస్తామని వెల్లడించారు.

సభలో పీ4 కార్యక్రమం ద్వారా లబ్ధి పొందిన లక్ష్మి అనే మహిళతోనూ సీఎం మాట్లాడారు. ఇటుకల బట్టీ ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం, టీవీఎస్ సంస్థ అందించిన సహకారంతో తాను మహిళా పారిశ్రామికవేత్తగా ఎదిగానని ఆమె సీఎంకు వివరించారు. ఇందుకు చంద్రబాబుకు, టీవీఎస్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రతి ఇంటికీ ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు చెప్పారు. టీవీఎస్, అదానీ, మెగా తదితర సంస్థలు సుమారు 8,900 మందిని దత్తత తీసుకుని వారి కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా సహకరిస్తున్నాయని అభినందించారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని మరింత మంది స్వయం ఉపాధి, పారిశ్రామిక రంగాల వైపు రావాలని కోరారు.

కుప్పంలోని ఓ సంస్థలో ఉద్యోగం సంపాదించిన సురేఖ అనే యువతిని సీఎం అభినందించారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడటంతో పాటు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలోనూ అంకుర సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తయారవ్వాలని అన్నారు. రైతులు ప్రకృతి సేద్యాన్ని, యువత పారిశ్రామిక రంగాన్ని, మహిళలు స్వయం ఉపాధిని ఆధారంగా చేసుకుని ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం నిరంతరం సహకరిస్తుందని సీఎం స్పష్టం చేశారు.