
పదేళ్ల నిరీక్షణకు తెర..
కరకట్టకు కొత్త రూపం
విజయవాడ-అమరావతి మధ్య కుడి కరకట్ట విస్తరణ పనులు
ఎం.గణేశ్, జర్నలిస్టు
అమరావతి ఉత్తరభాగంలోని 6.90 కిలోమీటర్ల కరకట్టను నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న 5.50 మీటర్ల వెడల్పును 24 మీటర్లకు పెంచుతున్నారు. కరకట్ట సగటు ఎత్తును 4.50 మీటర్ల నుంచి 6 మీటర్లకు పెంచుతున్నారు. మూడు ప్యాకేజీల్లో మొత్తం రూ.443.26 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపడుతున్నారు.
మొదటి ప్యాకేజీకి రూ.149.82 కోట్లు, రెండో ప్యాకేజీకి రూ.146.47 కోట్లు కేటాయించారు.మూడో ప్యాకేజీ పనులకు రూ.146.97 కోట్ల అంచనా వ్యయం ఉంది.రహదారి విస్తరణతో పాటు కరకట్టను పటిష్ఠం చేసే పనులు కూడా కొనసాగుతున్నాయి.
కృష్ణానది వైపు రక్షణ నిర్మాణాలు, నగరం వైపు రక్షణ గోడలను ఏర్పాటు చేస్తున్నారు.వాలులపై పచ్చిక, ఫుట్పాత్లు, వీధి దీపాలు, ప్రజా సౌకర్యాలు కల్పించనున్నారు.1954లో నిర్మించిన కరకట్టపై తొలుత 5.50 మీటర్ల వెడల్పుతో సింగిల్ లైన్ రహదారి ఉండేది.అమరావతి రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చెందడంతో ఈ మార్గంలో రాకపోకలు భారీగా పెరిగాయి.
దీంతో కరకట్ట విస్తరణ అవసరం గతంలోనే గుర్తించినా వివిధ కారణాలతో పనులు ముందుకు సాగలేదు.2024 వరదల సమయంలో కృష్ణానదిలో 11.43 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది.శతాబ్దానికి ఒకసారి వచ్చే గరిష్ఠ వరద ప్రవాహం సుమారు 13.90 లక్షల క్యూసెక్కుల వరకు ఉండవచ్చని అంచనా.ఈ నేపథ్యంలో కరకట్టను ఎత్తు, బలంతో పాటు రహదారి సామర్థ్యం పరంగా కూడా అభివృద్ధి చేస్తున్నారు.విజయవాడ–అమరావతి మధ్య ప్రత్యామ్నాయ అనుసంధాన మార్గాల అభివృద్ధి కూడా జరుగుతోంది.సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రకాశం బ్యారేజీ వైపు అనుసంధానించే పనులు పూర్తయితే రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది.కాలువలపై వంతెనలు, ఇతర అనుసంధాన మార్గాలు అందుబాటులోకి వస్తే కరకట్టపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.మొత్తంగా పదేళ్లుగా ప్రతిపాదనల దశలో ఉన్న కరకట్ట విస్తరణ ఇప్పుడు వరద రక్షణ, రాజధాని భద్రత, రవాణా సౌకర్యాన్ని కలిపిన కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటోంది.