ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్

ఏపీ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభం

బెజవాడ ఎక్స్‌ప్రెస్ బ్యూరో · July 12, 2026 · 1 month క్రితం

ఏపీ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభం
జూలై 19 వరకు కొనసాగనున్న చేనేత ఉత్పత్తుల విక్రయాలు
ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్ అర్జ శ్రీకాంత్

ఎం. గణేశ్, జర్నలిస్టు


ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికుల నైపుణ్యాన్ని దేశ రాజధానిలో పరిచయం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో చేనేత వస్త్ర ప్రదర్శన-అమ్మకాలను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. అశోక రోడ్డులోని ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన జూలై 12 నుంచి 19వ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు కొనసాగనుంది. ఈ ప్రదర్శనను ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్ అర్జ శ్రీకాంత్ (ఐఆర్‌టీఎస్), జాయింట్ కమిషనర్ ఎం.వి.ఎస్. రామారావు, డిప్యూటీ కమిషనర్ శ్రీమతి ఆర్. వెంకట రమణ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చేనేత కళాకారుల ప్రతిభను, సంప్రదాయ వస్త్రాల విశిష్టతను ప్రతిబింబించే పలు రకాల ఉత్పత్తులను సందర్శకులకు అందుబాటులో ఉంచారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 1,77,447 మంది చేనేత కార్మికులు జీవనోపాధిగా చేనేత పరిశ్రమపై ఆధారపడి ఉన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ప్రత్యేకమైన చేనేత సంప్రదాయం ఉండగా, స్థానిక కళాకారుల నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే అనేక రకాల వస్త్రాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. రాష్ట్రంలోని 35 చేనేత ఉత్పత్తులను “ఒక జిల్లా–ఒక ఉత్పత్తి” పథకం కింద గుర్తించారు. ఉప్పడ జామ్‌దానీ చీరలు, మంగళగిరి చీరలు, వెంకటగిరి చీరలు, ధర్మవరం పట్టు చీరలు, పావడాలకు భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించడం రాష్ట్ర చేనేత వైభవానికి నిదర్శనంగా నిలిచింది.
చేనేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ పలు సంక్షేమ, ప్రోత్సాహక కార్యక్రమాలను అమలు చేస్తోందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో “భారత్ టెక్స్–2026” అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శనలో కూడా ఆంధ్రప్రదేశ్ చేనేత ఉత్పత్తులను ప్రపంచస్థాయిలో ప్రదర్శించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. వ్యాపార భాగస్వామ్యాలతో పాటు వినియోగదారులకు నేరుగా చేనేత ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రదర్శన ప్రధాన ఉద్దేశమని వివరించారు. ప్రదర్శనలో పొందూరు ఖాదీ చీరలు, షర్టింగ్‌లు, కోనసీమ కాటన్ చీరలు, ఉప్పడ జామ్‌దానీ చీరలు, పెదన కలంకారీ చీరలు, బందర్ చీరలు, మంగళగిరి కాటన్ చీరలు, డ్రెస్ మెటీరియల్, లుంగీలు, బెడ్‌షీట్లు, వెంకటగిరి కాటన్, పట్టు చీరలు, ధర్మవరం పట్టు చీరలు, ఎమ్మిగనూరు బెడ్‌షీట్లు, కోడూరు గద్వాల చీరలు తదితర విస్తృత శ్రేణి చేనేత ఉత్పత్తులను విక్రయానికి ఉంచారు.ఢిల్లీలో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు చేనేత ప్రియులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని నాణ్యమైన చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడం ద్వారా రాష్ట్ర చేనేత కార్మికులను ప్రోత్సహించాలని చేనేత, జౌళి కమిషనర్ శ్రీమతి జి. రేఖారాణి విజ్ఞప్తి చేశారు.