విజయవాడ వార్తలు

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్‌..

బెజవాడ ఎక్స్‌ప్రెస్ బ్యూరో · August 6, 2026 · 1 week క్రితం
  • విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్‌..
  • భూసేకరణలో తొలి అడుగు,
  • ఈ నాలుగు చోట్ల మెట్రో స్టేషన్‌ల కోసం!

ఎం.గణేశ్,జర్నలిస్టు.

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు అమలులో భాగంగా భూసేకరణ ప్రక్రియకు తొలి అడుగు పడింది.
ప్రతిపాదిత మెట్రో మార్గంలో గన్నవరం ప్రాంతంలో అవసరమైన భూములను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.మెట్రో సంస్థ ప్రతినిధులు రెవెన్యూ, పంచాయతీరాజ్, రహదారులు, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులతో కలిసి స్థలాల కొలతలు చేపట్టారు.గన్నవరం పరిసరాల్లో ప్రతిపాదించిన నాలుగు మెట్రో నిలయాల నిర్మాణానికి అవసరమైన భూముల వివరాలను నమోదు చేశారు.ఈ నిలయాల నిర్మాణం కోసం సుమారు 1.35 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించారు.మెట్రో నిర్వహణ కేంద్రం ఏర్పాటుకు గన్నవరం సమీపంలో 61.15 ఎకరాల భూమిని సమీకరించేందుకు చర్యలు ప్రారంభించారు.భూముల యాజమాన్యం, రైతుల వివరాలు, పరిహారానికి సంబంధించిన అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని రెవెన్యూ శాఖకు సూచించారు.భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి నిర్మాణ పనులను ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.మొదటి దశలో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం వరకు తొలి మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు.అదే దశలో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు మరో మార్గాన్ని కూడా నిర్మించనున్నారు.మొత్తం తొలి దశ పొడవు 38.40 కిలోమీటర్లుగా నిర్ణయించగా వ్యయం సుమారు 11,009 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు.భూసేకరణ కోసం మాత్రమే 1,152 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అధికారులు లెక్కలు సిద్ధం చేశారు.మొదటి దశలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో మొత్తం 82.66 ఎకరాల భూమిని సేకరించనున్నారు.గన్నవరం విమానాశ్రయానికి మెట్రో అనుసంధానం కల్పించడం ద్వారా ప్రయాణికులకు వేగవంతమైన రవాణా అందుబాటులోకి రానుంది.బస్టాండ్, రైల్వే నిలయం, విమానాశ్రయం ఒకే రవాణా వ్యవస్థతో అనుసంధానమయ్యేలా ప్రణాళిక రూపొందించారు.వాణిజ్య కేంద్రాలు, విద్యాసంస్థలు, నివాస ప్రాంతాలకు మెట్రో సేవలు విస్తరించేలా నిలయాలను ప్రతిపాదించారు.మెట్రో ప్రాజెక్టు పూర్తయితే నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు కాలుష్య నియంత్రణకు కూడా దోహదం చేయనుంది.ప్రయాణ సమయం తగ్గడంతో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు గణనీయమైన ప్రయోజనం కలగనుంది.భూసేకరణ పూర్తయిన వెంటనే నిర్మాణ పనులను దశలవారీగా ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.రాజధాని ప్రాంత అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు రాష్ట్ర మౌలిక సదుపాయాల విస్తరణలో మరో ముఖ్యమైన ముందడుగుగా నిలవనుంది.