రాజకీయాలు

పంచారామ క్షేత్రాలకు మహర్దశ..

బెజవాడ ఎక్స్‌ప్రెస్ బ్యూరో · August 7, 2026 · 1 week క్రితం
  • పంచారామ క్షేత్రాలకు మహర్దశ..
  • కేంద్రానికి ఎంపీ సానా సతీష్ బిగ్ ప్రతిపాదన
  • క్షేత్రాల్లో మెరుగైన వసతులకు ప్రాధాన్యం
  • ప్రత్యేక పర్యాటక మార్గంగా అభివృద్ధికి ప్రతిపాదన
  • ద్రాక్షారామం శాసనాల పరిరక్షణకు చర్యలు

ఎం.గణేశ్, జర్నలిస్టు  

తెలుగు నేలపై అత్యంత పవిత్రంగా భావించే పంచారామ క్షేత్రాలను జాతీయ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు.అమరావతి, ద్రాక్షారామం, భీమవరం, సామర్లకోట, పాలకొల్లు పంచారామ క్షేత్రాలను కలిపి ప్రత్యేక ఆధ్యాత్మిక పర్యాటక మార్గంగా అభివృద్ధి చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వదేశ దర్శన్ రెండో దశ పథకంలో పంచారామ క్షేత్రాలకు చోటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పంచారామ క్షేత్రాలకు జాతీయ గుర్తింపు తీసుకొచ్చేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కోరారు. భక్తులు, పర్యాటకులు సులభంగా క్షేత్రాలను సందర్శించేలా అమరావతి–ద్రాక్షారామం, సామర్లకోట–ద్రాక్షారామం, పాలకొల్లు–భీమవరం మార్గాలను నాలుగు వరుసల రహదారులుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. క్షేత్రాల్లో మెరుగైన రవాణా, వసతి, వాహనాల నిలుపుదల, సమాచార సౌకర్యాలు కల్పించాలని కోరారు. ద్రాక్షారామంలోని చారిత్రక శాసనాలను పరిరక్షించేందుకు ప్రత్యేక సమాచార కేంద్రం ఏర్పాటు చేసి, వాటిని భద్రపరచాలని సూచించారు. పంచారామాలను ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తే గోదావరి ప్రాంతంలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. స్థానికులకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని వివరించారు. పంచారామ క్షేత్రాల అభివృద్ధికి సంబంధించి కేంద్ర పర్యాటక శాఖకు సమర్పించిన ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హామీ ఇచ్చినట్లు సానా సతీష్ బాబు తెలిపారు.