టీటీడీ హుండీ ఆదాయం

- టీటీడీ హుండీ ఆదాయం
- కొత్త రికార్డు
- జూలైలో రూ. 140.28 కోట్ల కానుకలు
ఎం.గణేశ్, జర్నలిస్టు
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డులను బ్రేక్ చేస్తోంది. జూలై నెలలో హుండీ ఆదాయం టీటీడీ చరిత్రలోను సరికొత్త రికార్డు ను నెల కొల్పింది. శ్రీ వేంకటేశ్వర స్వామివారికి భక్తులు సమర్పించే కానుకలు ఎప్పటికప్పుడు రికార్డులను తిరగరాస్తుండగా, జూలై నెలలో వచ్చిన హుండీ ఆదాయం ఆల్‌టైమ్ రికార్డుగా నిలిచింది. ఈ ఏడాది జూన్ నెలలో 25.26 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, టీటీడీకి రూ. 128.29 కోట్ల హుండీ ఆదాయం లభించింది. గతేడాది జూన్‌తో పోలిస్తే ఇది రూ. 8.44 కోట్లు ఎక్కువ. కాగా, జూలై నెలలో భక్తుల సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ ఆదాయం మాత్రం భారీగా సమకూరింది. జూలై 1 నుంచి 31 వరకు 24.52 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, రికార్డు స్థాయిలో రూ. 140.28 కోట్ల కానుకలు హుండీ ద్వారా లభించాయి. గతేడాది జూలై నెలలో వచ్చిన రూ. 129.45 కోట్లతో పోలిస్తే ఇది అత్యధికం. జూలై 16న ఒక్కరోజే గరిష్టంగా రూ. 5.31 కోట్లు రాగా, నెలలో మొత్తం 5 సార్లు రోజువారీ ఆదాయం రూ. 5 కోట్లు దాటింది. మరో 21 రోజుల పాటు రోజుకు రూ. 4 కోట్లకు పైగా కానుకలు నమోదయ్యాయి. శ్రీవారి దర్శనంతో పాటు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం విక్రయాల్లోనూ టీటీడీ రికార్డులను బ్రేక్ చేసింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రసాదాల తయారీని విస్తృతంగా పెంచి, ఎలాంటి కొరత లేకుండా పంపిణీ చేసింది. ఈ ఏడాది జూన్ నెలలో 1.27 కోట్ల లడ్డూలు అమ్ముడవగా, జూలై నెలలో ఏకంగా 1,30,86,278 లడ్డూలను భక్తులకు విక్రయించారు. టీటీడీ సమర్థవంతమైన ప్రణాళికతో 1.31 కోట్లకు పైగా లడ్డూలను తయారు చేసి భక్తులకు నిరంతరాయంగా అందించింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ చేపట్టిన ముందస్తు చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి.