రాజధానికి రాజమార్గం… సీడ్ యాక్సెస్

*రాజధానికి రాజమార్గం… సీడ్ యాక్సెస్
*అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు
*ఐదు కాన్సెప్టులతో దేశం మెచ్చిన రాజధానిగా అమరావతి
*స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
*రాయపూడిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవన సముదాయం పరిశీలన
ఎం.గణేశ్, జర్నలిస్టు
రాజధాని అమరావతికి ప్రధాన అనుసంధాన రహదారి అందుబాటులోకి వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉండవల్లి వద్ద విజయవాడ, మంగళగిరి, గుంటూరులను అమరావతితో కలిపే ప్రధాన రహదారిని, బకింగ్‌హామ్ కాలువపై నిర్మించిన ఉక్కు వంతెనలను ముఖ్యమంత్రి ప్రారంభించారు.రాయపూడి నుంచి వెంకటపాలెం, పెనుమాక మీదుగా ఉండవల్లి వరకు ఈ రహదారిని నిర్మించారు. మూడో దశలో తాడేపల్లి సమీపంలో జాతీయ రహదారితో అనుసంధానం చేయనున్నారు. ఇందుకు రూ.1,519 కోట్ల వ్యయం కానుంది.అమరావతి నిర్మాణంలో ఇది తొలి అడుగు మాత్రమేనని ముఖ్యమంత్రి అన్నారు. రైతుల త్యాగం, ప్రజల ఆకాంక్షలతో అమరావతి నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు. కాలుష్య రహిత, పచ్చదనం, స్వచ్ఛమైన ఇంధనం, ఆధునిక సాంకేతికత, కృత్రిమ మేధస్సుతో కూడిన ప్రపంచస్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.అమరావతిని దేశం మెచ్చే రాజధానిగా తీర్చిదిద్ది 2028 నాటికి ప్రారంభించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు.2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని, ప్రజా భాగస్వామ్యంతో జాతీయ జెండా ప్రదర్శనలు నిర్వహించాలని కోరారు.అనంతరం రాయపూడిలో నూతనంగా నిర్మించిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు.