వైసీపీలో గ్రంధి శ్రీనివాస్ ?

భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2024 ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన పార్టీకి రాజీనామా చేసి బీజేపీ లేదా టీడీపీలో చేరుతారనే ప్రచారం జరిగినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఆయన మళ్లీ వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అయితే పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో పార్టీని వీడి వెళ్లిన నేతలను తిరిగి చేర్చుకోవాలా వద్దా అనే అంశంపై వైసీపీ నాయకత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విజయం సాధించి రాజకీయంగా గుర్తింపు పొందిన గ్రంధి శ్రీనివాస్, 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరగడం, వ్యాపారాలకు సంబంధించిన పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీకి దూరమయ్యారు. ఇటీవల జిల్లా రాజకీయాల్లో మారుతున్న పరిస్థితులు, స్థానిక సామాజిక సమీకరణలు, భీమవరం నియోజకవర్గంలో ఆయనకున్న వ్యక్తిగత ఓటు బ్యాంకు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ నాయకత్వం కూడా ఆయన చేరికపై సానుకూలంగా ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.